: ఎస్‌7, ఎస్‌7ఎడ్జ్‌ ప్రీ బుకింగ్స్ చేసుకొనే వారికి శామ్‌సంగ్‌ ఆఫ‌ర్..

శామ్‌సంగ్ అభిమానులు ఎదురుచూస్తోన్న గెలాక్సీ ఎస్‌7, గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్లు మంగళవారం భారత మార్కెట్లోకి వ‌చ్చేశాయి. మార్చి 18 నుంచి మార్కెట్లో కొనుగోళ్లకు అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌7 ధర రూ.48,900కాగా, ఎస్‌7 ఎడ్జ్‌ ధర రూ.56,900. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ప్రీ బుకింగ్‌లు చేసుకోవచ్చు. అభిమానుల‌కు శామ్‌సంగ్ ఓ ఆఫర్ కూడా ప్ర‌క‌టించింది. మార్చి 17వ‌ర‌కు ప్రీ బుకింగ్స్ చేసుకున్నవారికి ఉచితంగా గేర్ వీఆర్ ను అందించ‌నున్న‌ట్లు తెలిపింది. తన ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లయిన ఈ రెండు ఫోన్లను ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త మోడళ్ల డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుందని, అలాగే తొలిసారి ఈ మొబైళ్లలో డ్యూయల్ పిక్సల్ కెమెరాను వాడినట్టు శామ్‌సంగ్ తెలిపింది. గెలాక్సీ ఎస్‌7 త్రీడీ గ్లాస్ మెటల్ బాడీతో వస్తుంది. దీనిలో 5.1 క్యూహెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇక ఎస్‌7 ఎడ్జ్‌ లో 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ 12 మెగా పిక్సల్‌ డుయల్ రియర్‌ లెన్స్ ఉంటాయి. గెలాక్సీ ఎస్‌-7 బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్‌, ఎస్‌7 ఎడ్జ్‌ బ్యాటరీ పవర్‌ 3600 ఎంఏహెచ్‌. బ్లాక్ షప్పైర్, గోల్డ్‌ ప్లాటినమ్‌, సిల్వర్ టైటానియం రంగుల్లో మూడు వేరియంట్లలో ల‌భిస్తున్నాయి.

More Telugu News