: లిక్కర్ కింగ్ కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు... డిఫాల్టర్ ముద్ర తొలగించేందుకు ససేమిరా

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. యునైటెడ్ బ్రూవరీస్ పేరిట మద్యం ఉత్పత్తులతో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్’ పేరిట పౌరవిమానయాన రంగంలోకి అడుగిడి పెద్ద పొరపాటే చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల దెబ్బకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్)ను బ్రిటన్ కంపెనీ డియాజియోకు అమ్మేసిన మాల్యా... చక్కగా లండన్ చెక్కేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనిని పసిగట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన విదేశీ పర్యటనను అడ్డుకోవాలని, పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయాలని బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)లో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా తనపై పడ్డ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్ ఫుల్ డిఫాల్టర్)’ అన్న ముద్రను తొలగించాలన్న మాల్యా పిటిషన్ పై కన్నెత్తి చూసేందుకు కూడా ఢిల్లీ హైకోర్టు ససేమిరా అంది. మాల్యా పిటిషన్ ను విచారణకు స్వీకరించని ఢిల్లీ హైకోర్టు, ఆ పిటిషన్ ను తాము విచారించలేమని నిన్న తేల్చిచెప్పింది. అయితే గుడ్డిలో మెల్లలా... సదరు అభ్యర్థనపై ఇతర కోర్టులకు వెళ్లే విషయంపై మాత్రం కోర్టు నిషేధం విధించలేదు.

More Telugu News