: కొనేవారు కరవు... ఇండియాలో బంగారానికి తగ్గుతున్న డిమాండ్!

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అసంతృప్తిగా ఉండటం, వివిధ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు తదితర కారణాలతో ఈ సంవత్సరం బంగారానికి డిమాండ్ 15 శాతం వరకూ తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వివాహ సీజన్ తో పోలిస్తే ఈ ఏడు 10 నుంచి 15 శాతం వరకూ తక్కువ అమ్మకాలు సాగుతాయని భావిస్తున్నట్టు ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. "ఈ సంవత్సరం రైతులకు దిగుబడి తక్కువగా రానుంది. దీంతో వారి వద్ద డబ్బులకూ కొరత ఏర్పడుతుంది. రబీలో సైతం పరిస్థితులు అనుకూలంగా ఉండేలా కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లు అసంతృప్తికరంగా సాగనున్నాయి" అని ఐబీజేఏ ప్రతినిధి కేతన్ షరోఫ్ వ్యాఖ్యానించారు. కాగా, ఇండియాలో సాలీనా 950 నుంచి 1000 టన్నుల బంగారం విక్రయాలు జరుగుతుండగా, అందులో 60 శాతం వరకూ గ్రామీణ ప్రాంతాల్లోనే లావాదేవీలు జరుగుతుంటాయి. గ్రామాల్లో ప్రజల వద్ద ఈ సంవత్సరం అంతగా డబ్బు చేరకపోవచ్చని పీఎన్ గాడ్గిల్ జ్యూయెలర్స్ ఎండీ సౌరభ్ గాడ్గిల్ అంచనా వేశారు. మొత్తం మీద 2016లో కొనుగోళ్లు మందగిస్తాయని, బంగారం ధరలు ఇంకాస్త తగ్గినా, పరిస్థితి మారకపోవచ్చని ఆయన వివరించారు.

More Telugu News