: అంబానీ కంపెనీని కొనేస్తున్న బిర్లా!

అనిల్ ధీరూభాయ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ రిలయన్స్ సిమెంట్స్ ను బిర్లా కార్పొరేషన్ కొనుగోలు చేయనుంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో రిలయన్స్ సిమెంట్స్ అమ్మకానికి అనిల్ అంబానీ బిడ్లను పిలవగా, రూ. 5 వేల కోట్లను బిర్లా కార్పొరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రిలయన్స్ గ్రూప్ తో బిర్లాల చర్చలు కూడా సఫలవంతమయ్యాయని ఈ డీల్ గురించిన సమాచారమున్న ఇరు కంపెనీల ఉన్నతోద్యోగులు వెల్లడించారు. రిలయన్స్ సిమెంట్స్ ను కొనుగోలు చేయాలని భావించి రంగంలోకి దిగిన బ్లాక్ స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ, కార్ల్ యేల్, జేఎస్ డబ్ల్యూ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, చైనా రిసోర్సెస్ సిమెంట్ హోల్డింగ్స్ తదితర కంపెనీలు వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. కాగా, రిలయన్స్ గ్రూప్ అంచనాలకు తగ్గట్టుగానే బిర్లా కార్పొరేషన్ ఆఫర్ ఉందని, మొత్తం రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 5,100 కోట్లను ఇచ్చేందుకు బిర్లాలు బిడ్ దాఖలు చేయగా, అందులో రూ. 4,200 కోట్ల నుంచి రూ. 4,500 కోట్ల వరకూ పీఈ (ప్రైవేట్ ఈక్విటీ) రూపంలో ఉంటాయని సమాచారం. మరో రెండు వారాల్లో ఈ డీల్ పై తుది ప్రకటన వెలువడుతుందని అధికారులు వెల్లడించారు.

More Telugu News