: ఈ కారుపై ఎంత మోజో... ఐదు వారాల్లో 50 వేల బుకింగ్స్!

ఆ కారు అందరినీ ఆకర్షిస్తోంది. భారత్ లో విడుదలైన తరువాత ఐదు వారాల లోపే 50 వేలకు పైగా అమ్మకాలు సాధించింది. అదే రెనాల్ట్ క్విడ్! సెప్టెంబర్ 24న ఈ కారు మధ్య తరగతి ప్రజలకు ఎంతో దగ్గరైందని తెలుస్తోంది. కేవలం రూ. 2.56 లక్షల (ఎక్స్ షోరూం, ఢిల్లీ) ధరలో పెట్రోల్ వేరియంట్ గా, లీటరు ఇంధనంతో 25 కి.మీ మైలేజీని ఇచ్చేలా ఫ్రాన్స్ సంస్థ రెనాల్ట్ తయారు చేసిన కారిది. భారత మార్కెట్ కు, రహదారులకు నప్పేలా కారును రూపొందించడమే తమ విజయ లక్ష్యమని రెనాల్ట్ ఇండియా సీఈవో అండ్ ఎండీ సుమిత్ స్వాహ్నే వ్యాఖ్యానించారు. కారుకు డిమాండ్ పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగా వాహనాలను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, ఆల్టో 800కు క్విడ్ గట్టి పోటీని ఇస్తోందని ఆటో ఇండస్ట్రీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బాలీ స్టైల్ హ్యాచ్ బ్యాక్ గా మార్కెట్లోకి వచ్చిన కారు ఇంజన్ 53 బీహెచ్పీ పవర్ ను అందిస్తుంది. ఈ కారును కొని రోడ్డుపైకి తేవాలంటే తెలుగు రాష్ట్రాల మార్కెట్లో సుమారు రూ. 2.80 లక్షలు (అన్ని పన్నులు సహా) వెచ్చించాల్సి వుంది.

More Telugu News