అమరావతి మరో హైదరాబాదు కారాదు...శంకుస్థాపనకు రావాలనే ఉంది: పవన్ కల్యాణ్ కామెంట్స్

17-10-2015 Sat 11:43

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలని ఏపీ మంత్రులు అందించిన ఆహ్వాన పత్రికను తీసుకున్న సందర్భంగా జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి మరో హైదరాబాదు కాకూడదని వ్యాఖ్యానించిన ఆయన, గతంలో చేసిన తప్పులు పునరావృతం కారాదని అభిలషించారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుహృద్భావ వాతావరణంలో మెలగాలన్నారు. ఒకరిపై మరొకరు ఎల్లకాలం ద్వేషం కొనసాగించలేరని కూడా ఆయన అన్నారు. అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని తనకూ ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే తన తాజా చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇందుకు అనుమతించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత షెడ్యూల్ ను ముగించుకుని తదుపరి షెడ్యూల్ కోసం గుజరాత్ వెళుతున్నామని తెలిపారు. అక్కడి షూటింగ్ పరిస్థితులపైనే తాను శంకుస్థాపనకు హాజరయ్యే అంశం ఆధారపడి ఉందన్నారు. తనకు మాత్రం శంకుస్థాపనకు హాజరు కావాలనే ఉందని చెప్పారు. ఇక ఏపీ ప్రభుత్వానికి సలహాలిచ్చేంత అనుభవం తనకు లేదని పవన్ అన్నారు.