పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఫోన్... శంకుస్థాపనకు తప్పకుండా రావాలని ఆహ్వానం

17-10-2015 Sat 09:24

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ ఏపీ సర్కారు ఆహ్వానాలు ఊపందుకున్నాయి. నిన్న చెన్నై వెళ్లిన టీడీపీ సీనీయర్ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఆహ్వానం పలికారు. మరోవైపు ఆహ్వాన పత్రికలు తీసుకుని ఏపీ మంత్రులు హైదరాబాదు సహా దేశంలో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. అమరావతి శంకుస్థాపనకు తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంగా పవన్ కు చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఇదిలా ఉంటే, నేడు ఏపీ మంత్రులు నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో పవన్ కల్యాణ్ కు స్వయంగా ఆహ్వాన పత్రికను అందించనున్నారు.