రూ. కోటి కోట్లకు చేరువైన భారత ఇన్వెస్టర్ల సంపద

15-10-2015 Thu 16:09

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో ఇన్వెస్టర్ల సంపద మరోసారి కోటి కోట్ల రూపాయలకు చేరువైంది. గురువారం నాటి సెషన్ ఆరంభం నుంచే నూతన కొనుగోళ్లు వెల్లువెత్తడంలో సెన్సెక్స్ బుల్ దూసుకెళ్లింది. క్రితం ముగింపుతో పోలిస్తే, 200 పాయింట్ల లాభంలో ప్రారంభమైన సెన్సెక్స్ సూచిక, తొలి గంట వ్యవధిలో కొద్దిగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ఆపై వెనుదిరిగి చూడలేదు. ఆసియా మార్కెట్లకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల సరళి అనుకూలంగా ఉండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ ఎత్తున భారత ఈక్విటీల కొనుగోళ్లకు ప్రయత్నించారు. దీంతో బుధవారం నాడు రూ. 98,63,210 కోట్ల వద్ద కొనసాగిన బీఎస్ఈ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 99,34,979 కోట్లకు చేరింది. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 230.48 పాయింట్లు పెరిగి 0.86 శాతం లాభంతో 27,010.14 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 71.60 పాయింట్లు పెరిగి 0.88 శాతం లాభంతో 8,179.50 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.79 శాతం, స్మాల్ క్యాప్ 0.48 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈ-50లో జడ్ఈఈఎల్, టాటా మోటార్స్, బీపీసీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీలు 3 నుంచి 8 శాతం మేరకు లాభపడగా, సిప్లా, ఎంఅండ్ఎం, విప్రో, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీలు అర శాతం నుంచి 1.15 శాతం వరకూ నష్టపోయాయి.