: ఎమ్మెల్యే తిట్ల దండకం... వెక్కివెక్కి ఏడ్చిన ఇంజినీర్

తెలంగాణలో ప్రభుత్వాధికారులకు గడ్డు కాలమే వచ్చేసినట్లుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధుల వేధింపులతో అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటికి మొన్న ఆదిలాబాదు జిల్లాలో సాగు నీటి శాఖకు చెందిన ఇంజినీర్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గల్లా పట్టుకుని మరీ చెంపలు వాయించారు. తాజాగా నిన్న రంగారెడ్డి జిల్లా వికారాబాదు ఎమ్మెల్యే సంజీవరావు (టీఆర్ఎస్) మునిసిపల్ డీఈ గోపాల్ పై తిట్ల దండకం అందుకున్నారు. ఫైళ్లు తీసుకుని ఇంటికి రావాలన్న ఎమ్మెల్యే గారి మాట ఇంజినీర్ వినలేదట. అంతే, అగ్గిమీద గుగ్గిలమైన ఎమ్మెల్యే నేరుగా మునిసిపల్ కార్యాలయానికి వచ్చేశారు. నేరుగా కమిషననర్ చాంబర్ లోకెళ్లి కూర్చున్న ఎమ్మెల్యే గారి వద్దకు ఇంజినీర్ వెళ్లక తప్పలేదు. ఇంజినీర్ ను చూసిన వెంటనే సంజీవరావు ఆగ్రహోదగ్రులయ్యారు. ఫైళ్లు ఇంటికి తెమ్మంటే ఎందుకు తేలేదని బూతు పురాణం వినిపించారట. దీంతో తీవ్ర వేదనకు గురైన గోపాల్ అక్కడే వెక్కివెక్కి ఏడ్చారట. ఆ తర్వాత ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయినా, గోపాల్ ఏడుస్తూనే కూర్చుండిపోయారట. ఈ తతంగం మొత్తాన్ని సీసీటీవీలో చూసిన కమిషనర్ అక్కడికెళ్లి గోపాల్ ను ఓదార్చారట. విషయం తెలుసుకున్న మునిసిపల్ సిబ్బంది అప్పటికప్పుడు నిరసనకు దిగి ఎమ్మెల్యేపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

More Telugu News