నన్ను చంపుకోండి... అయినా పోరు ఆగదు: బీజేపీ చీఫ్ కు తేల్చిచెప్పిన యువ సంచలనం

15-10-2015 Thu 10:40

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ ఘాటు రిప్లై ఇచ్చాడు. ‘‘అవసరమైతే నాపై మీ బలగాలతో దాడులు చేయించుకోండి. నన్ను చంపేసుకోండి. నేను పోతే నాలాంటి వాళ్లు చాలా మంది వస్తారు. నేను బతికున్నంత వరకు మాత్రం ఉద్యమం ఆగదు’’ అంటూ హార్దిక్ పటేల్ బీజేపీ చీఫ్ కు భారీ షాకిచ్చారు. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న ఉద్యమాన్ని విరమించాలని హార్దిక్ పటేల్ కు అమిత్ షా సూచించిన సంగతి తెలిసిందే. అమిత్ షా సూచనను తీవ్రంగా పరిగణించిన హార్దిక్ ఈ మేరకు ఘాటు రిప్లై ఇచ్చారు. అంతేకాక బీజేపీ చీఫ్ చెప్పినంత మాత్రాన ఉద్యమం ఆపేయాలా? అంటూ కూడా హార్దిక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వీలయితే మా డిమాండ్లు పరిష్కరించండి. తద్వారా మాకు న్యాయం చేయండి. అలా కాకుంటే, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి’’ అని హార్దిక్ బీజేపీకి సవాల్ విసిరారు.