మూడో తరగతి విద్యార్థి... ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశాడు!

14-10-2015 Wed 10:39

ఆ మధ్య తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై అక్కడి విద్యార్థులే హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన కోర్టు సమస్యపై దృష్టి సారించింది. తాజాగా బెంగళూరుకు చెందిన 8 సంవత్సరాల అభినవ్ అనే ఓ విద్యార్థి దేశ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశాడు. బెంగళూరులోని వాయవ్య ప్రాంతంలో చాలాకాలంగా ఫ్లైఓవర్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో అటుగా రాకపోకలు సాగడం లేదు. అభినవ్ ఇంటి నుంచి యశ్వంత్ పూర్ లో ఉన్న పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరం. అయినా వెళ్లేందుకు 45 నిమిషాలు పడుతోంది. అక్కడ రైల్వేక్రాసింగ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వల్లే ఇలా జరుగుతోందని బాలుడికి అర్థమైంది. దానిపై ఆలోచించి సమస్యపై, అక్కడి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ పీఎంవోకు మెయిల్ పంపాడు. అభినవ్ మెయిల్ ను పరిశీలించిన పీఎంవో కార్యాలయం సమస్య పరిష్కరించాలని వెంటనే రైల్వే శాఖకు సూచించింది.