చంద్రబాబుకిది తగునా?: ద్రోణంరాజు శ్రీనివాస్

13-10-2015 Tue 08:08

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థాయికి తగ్గట్టు వ్యవహరించడం లేదని కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తెల్లారి నిద్ర లేచింది మొదలు తనను బూతులు తిట్టే కేసీఆర్ దగ్గరకు స్వయంగా వెళ్లి ఆహ్వానించే చంద్రబాబుకు, సొంత రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతలు కనపడడం లేదని అన్నారు. అయినవారికి ఆకుల్లోను, కానివారికి కంచాల్లోను పెట్టడం చంద్రబాబుకు బాగా అలవాటని ఆయన ఆక్షేపించారు. సొంత రాష్ట్రంలో ఉన్న విపక్షాలను పట్టించుకోకుండా, తెల్లారి లేచింది మొదలు తిట్టేవారికి పెద్దపీట వేయడంలో చంద్రబాబు అభిమతం తెలుస్తుందని ఆయన అన్నారు. ముందు రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాజధాని టీడీపీకి మాత్రమే సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయమని సీఎం గుర్తించాలని ఆయన తెలిపారు. విపక్షాలను కలుపుకుని పోవాలని, మీడియా ద్వారా విపక్షాలు విషయాలు తెలుసుకునే దుస్థితి రాకూడదని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం మొత్తం రహస్య ఎజెండాగా జరుగుతోందని ఆయన ఆరోపించారు.