జగన్ దీక్షకు మద్దతు పలికిన కాంగ్రెస్ నేత హర్షకుమార్

12-10-2015 Mon 13:15

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మద్దతు పలికారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైకాపా శ్రేణులు దీక్ష చేపట్టిన శిబిరాన్ని ఈ రోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ, జగన్ చేపట్టిన నిరాహార దీక్ష చాలా గొప్పదని ప్రశంసించారు. స్వార్థం కోసం జగన్ దీక్ష చేపట్టలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించాలనే తపనతోనే జగన్ దీక్ష చేస్తున్నారని తెలిపారు. అన్ని పార్టీలు కలసికట్టుగా ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.