: ఐటీ ఉద్యోగం సంపాదించడం ఇక కష్టమే!

ఇండియాలో ప్రైవేటు రంగంలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇకపై ఉపాధి పొందడం అంత సులభమేమీ కాదంటున్నారు నిపుణులు. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో సంస్థలు ఉండటంతో, అపారమైన నైపుణ్యముంటేనే, ఐటీ కొలువులు దరిచేరుతున్నాయి. సుమారు 35 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని ఇచ్చిన ఐటీ రంగంలో, కొత్త ఉద్యోగ నియామకాలు గత సంవత్సరం తగ్గిపోయాయి. సాఫ్ట్‌ వేర్ కోడింగ్‌ విభాగంలో ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడంతో, సంప్రదాయ ఐటీ సేవలకు గిరాకీ గణనీయంగా తగ్గింది. తక్కువ నైపుణ్యం కలిగిన సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, మౌలిక సదుపాయాల నిర్వహణ నిపుణుల అవసరం తగ్గిపోయింది. క్లౌడ్, సామాజిక మొబిలిటీ, బిగ్ డేటా విశ్లేషణ, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలో నైపుణ్యం చూపే వారికే ఐటీ ఉద్యోగాలు దక్కనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలం వరకూ, భారత్ కొత్తగా కల్పిస్తున్న ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం సంప్రదాయ ఐటీ విభాగంలోనే దక్కగా, ఇకపై ఆ తరహాలో పరిస్థితులు ఉండవని చెబుతున్నారు. 2014-15లో ఐటీ రంగం 2.24 లక్షల ఉద్యోగాలను ఇవ్వగా, 2015-16లో ఆ సంఖ్య 2 లక్షలను దాటబోదని నాస్ కామ్ అంచనా వేసింది. రాబోయే కాలంలో, ఐటీ కంపెనీల ఆదాయాల వృద్ధిరేటుకు సమానంగా ఉద్యోగ నియామకాల వృద్ధి ఉండే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. 2003లో ఐటీ పరిశ్రమకు రూ. 6,300 కోట్ల ఆదాయానికి 38,000 మందికి ఉద్యోగాలు లభించగా, 2015, మార్చితో ముగిసిన ఏడాదిలో ప్రతి రూ. 6,300 కోట్ల ఆదాయానికి కేవలం 14,350 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని నాస్‌ కామ్ తెలిపింది. అవసరం లేకున్నా కొందరు ఉద్యోగులను అదనంగా నియమించుకున్న ఐటీ కంపెనీల్లో ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొంది.

More Telugu News