: ధర తగ్గాలి, వేగం పెరగాలి: భారత యువత కోరిక ఇదే!

ఇప్పుడు నడుస్తున్నదంతా 3జీ, 4జీ కాలం. అభివృద్ధి చెందిన దేశాల్లో 4జీ ఇప్పటికే విస్తరించి, 5జీ దిశగా సాగిపోతుండగా, ఇండియాలో మాత్రం ఇంకా 3జీ సేవల విస్తరణే పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా 80 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్లు 2జీ మాధ్యమంలోనే డేటా సేవలను పొందుతున్నాయి. వాస్తవానికి 2జీతో పోలిస్తే 3జీ, 4జీ తరంగాలు చౌకగా లభిస్తాయి. దీంతో తమ స్మార్ట్ ఫోన్లకు వచ్చే డేటా వేగం పెరగాలని, అందుకు వెచ్చిస్తున్న పాకెట్ మనీ తగ్గాలని భారత యువత కోరుతోంది. ఇందుకు అనుగుణంగానే, వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 4జీ సేవల విస్తరణ భారత్ లో జరుగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు చౌకగా భారతీయులకు అందే రోజులు అతి త్వరలో రానున్నాయని ఎరిక్సన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాన్స్ వెస్ట్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే నంబర్ 1 టెలికం పరికరాల తయారీ సంస్థగా ఉన్న ఎరిక్సన్ గడచిన జూన్ త్రైమాసికంలో భారత్ నుంచి వచ్చే ఆదాయాన్ని 85 శాతం పెంచుకుంది. ఈ నేపథ్యంలో వెస్ట్ బర్గ్ మాట్లాడుతూ, ఇండియాలో ఫిక్సెడ్ టెలిఫోన్ లైన్ల సంఖ్య గణనీయంగా తగ్గిన నేపథ్యంలో, కస్టమర్లు 3జీ, 4 జీ సేవలను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తమ సంస్థ వృద్ధికి భారత మార్కెట్ అత్యంత కీలకమని వివరించారు.

More Telugu News