: ధోనీ ముందు క్లిష్ట సమస్య..!

నాలుగో టెస్టు మరో మూడు రోజుల్లో ఆరంభం కానుండగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎదుట క్లిష్ట సమస్య నిలిచింది. ఆటగాళ్ళ గాయాలు, ఫామ్ లేమి... ఇలా ఎన్నో అంశాలు తుది జట్టు ఎంపికలో ధోనీకి తలనొప్పిగా తయారయ్యాయి. ప్రధాన బౌలర్ ఇషాంత్ శర్మ ఇప్పటికే ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టుకు దూరమయ్యాడు. భువీ గాయంపై అనిశ్చితి వీడలేదు. శుభారంభం ఇవ్వాల్సిన ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు టెస్టుల్లోనూ నిరాశపరిచాడు. ఆపద్బాంధవుడు విరాట్ కోహ్లీ బ్యాట్ మూగనోము పట్టింది. ఇటు నెంబర్ 3 స్థానానికి ఛటేశ్వర్ పుజారా న్యాయం చేయలేకపోతున్నాడు. వీటన్నింటికి చెక్ పెడుతూ... ఈ నెల 7న ఆరంభమయ్యే నాలుగో టెస్టులో సరైన జట్టుతో బరిలో దిగడం పెను సవాలుగా మారింది. ఆ మ్యాచ్ లో నెగ్గితేనే సిరీస్ చేజిక్కించుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. కాగా, నాలుగో టెస్టుకు వేదికైన ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న వార్తలు కెప్టెన్ ధోనీకి ఊరటనిచ్చేవే. దీంతో, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగే వెసులుబాటు ఉంటుంది. అదే జరిగితే సౌతాంప్టన్ టెస్టులో విఫలమైన రాజస్థాన్ పేసర్ పంకజ్ సింగ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వస్తాడు. ఇక, ధావన్ స్థానంలో గంభీర్ రాక దాదాపు ఖాయంగానే కనిస్తోంది. గంభీర్ అనుభవం టీమిండియాకు లాభించే అంశం.

More Telugu News