సింగపూర్లో కూరగాయల వ్యాపారం పెట్టిన జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం

04-08-2014 Mon 12:46

టెలివిజన్లు, ఆడియో ప్లేయర్లు, హోం థియేటర్లంటే వెంటనే గుర్తొచ్చే పేరు పానాసోనిక్. ఈ జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఇప్పుడు పూర్తిగా కొత్తదైన వ్యాపారంలోకి అడుగిడింది. సింగపూర్లో కూరగాయల పెంపకం, విక్రయంపై దృష్టి సారించిన పానాసోనిక్ ఈ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. వ్యవసాయ యోగ్యమైన భూముల లభ్యత తగ్గిపోతుండడంతో తాము 'టవర్' విధానంలో కూరగాయలు, ఆకు కూరలను సాగుచేస్తున్నామని పానాసోనిక్ ఫ్యాక్టరీ సొల్యూషన్స్ ఆసియా పసిఫిక్ విభాగం మేనేజింగ్ డైరక్టర్ హిదెకి బాబా తెలిపారు. సింగపూర్లో సంస్థకు చెందిన ఫ్యాక్టరీలో 248 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కూరగాయల సాగు చేపట్టారు. పూర్తిగా ఇండోర్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ ప్లాంట్ లో 10 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సాలీనా 3.6 టన్నుల కూరగాయలు పండిస్తున్నారు. 2017 మార్చి నాటికి 30 రకాల కూరగాయలు ఉత్పత్తి చేయాలని పానాసోనిక్ లక్ష్యంగా పెట్టుకుంది. టవర్ విధానం అంటే ఓ భవంతిలోని పలు ఫ్లోర్లలో మట్టి నింపిన క్రేట్లలో మొక్కలు పెంచుతారు. వీటికి కృత్రిమ పద్ధతిలో కాంతిని అందిస్తారు.