ఇవ్వకపోతే... చీపురుకట్టలు, చెప్పులతో టీఆర్ఎస్ భవన్ ను ముట్టడించాలి: కంచె ఐలయ్య

04-08-2014 Mon 11:09

ప్రముఖ సామాజిక వేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే బోనాలు మాత్రమే కాదని డైరెక్ట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జరిగిన 'బహుజన యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ఎన్ని పోరాటాలు చేశామో... ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అన్ని పోరాటాలు మళ్లీ చేస్తామని హెచ్చరించారు. దళితులకు మూడెకరాల భూమి, రెండు గదులతో కూడిన ఇంటిని రెండు నెలల్లోగా ఇవ్వకపోతే... చీపురు కట్టలు, చెప్పులతో టీఆర్ఎస్ భవన్ ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా సబ్ ప్లాన్ లో ఎస్సీలకు రూ. 6 కోట్లు, ఎస్టీలకు రూ. 10 కోట్లు ఖర్చు చేయాలని సూచించారు. ఏపీ, టీఎస్ ప్రభుత్వాలు ప్రతి గర్భిణికి నెలకు రూ. 3 వేలు ఇస్తే... శిశు మరణాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.