స్టేట్ బ్యాంక్ ఛైర్మన్ కు 1800 కిలోల బంగారాన్ని అప్పగించనున్న టీటీడీ

02-08-2014 Sat 11:48

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అరుంధతీ భట్టాచార్యకు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి... శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శ్రీవారికి భక్తులు ఆభరణాల రూపంలో సమర్పించిన 1800 కిలోల బంగారాన్ని టీటీడీ అధికారులు ఎస్ బీఐ లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు బ్యాంక్ ఛైర్మన్ తిరుమలకు విచ్చేశారు.