మావోలు మళ్లీ విజృంభిస్తున్నారా?

02-08-2014 Sat 09:57

రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పిందే జరగబోతుందేమో! రాష్ట్రాన్ని విభజిస్తే ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లోనూ మావోయిస్టులు మళ్లీ తమ ప్రాబల్యం పెంచుకుంటారని కమిటీ చెప్పింది. అంతేకాక, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు ఓ రహస్య నివేదికనూ దానికి జత చేసింది. ఇందులోనూ శాంతిభద్రతల అంశంతో పాటు మావోల ప్రస్తావన ప్రధానంగా ఉందని కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి దుగ్గల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ ఊహించినట్లుగానే తాజాగా మావోయిస్టుల కదలికలు రెండు రాష్ట్రాల్లోనూ ప్రారంభమయ్యాయన్న వాదనలకు బలం చేకూర్చే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ తరహా ఘటనలు తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాకు సరిహద్దుగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మావోలు ప్రవేశించారనడానికి నిదర్శనంగా వారం రోజులుగా వరుస క్రమంలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన ఓ వ్యాపారి కొడుకును మావోలుగా చెప్పుకున్న కొందరు కిడ్నాప్ చేసి, సదరు వ్యాపారి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసుకుని విడిచిపెట్టారు. అనంతరం తాజాగా జంగారెడ్డిగూడెంకు చెందిన పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలకు ఫోన్లు చేసిన మావోయిస్టులు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లు చేసిన వారు మావోయిస్టులేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఈ తరహా బెదిరింపులకు గురైన వ్యక్తులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. దీనిపై పోలీసులు ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో పడిపోయారు.