మట్టితో శ్రీ చక్రం

శక్తి స్వరూపిణి ... జగన్మాత అయిన అమ్మవారిని శ్రీచక్ర రూపంలో పూజించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. రాగి ... ఇత్తడి ... బంగారు ... పంచలోహాలతో తయారు చేసిన రేకులపై ముద్రించబడిన శ్రీ చక్రాన్ని, ఇవే లోహాలతో మేరువు ఆకారంలోగల శ్రీ చక్రాలను అత్యంత నియమ నిష్టలతో పూజిస్తుంటారు.

సాక్షాత్తు శ్రీ చక్రంలో బాలా త్రిపురసుందరి బిందురూపంలో వుంటుంది కనుక, ఈ పూజ పరమపవిత్రమైనదిగా భావిస్తుంటారు. అంతటి మహిమాన్వితమైన శ్రీ చక్రాన్ని బంకమట్టితో తయారు చేసి పూజించే ఆచారం మనకి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటుంది. వివాహం కావలసిన కన్యలు తమకి మంచి భర్త లభించాలనే ఉద్దేశంతో అమ్మవారిని ఇలా పూజిస్తూ వుంటారు. బంకమట్టితో తయారుచేసిన శ్రీ చక్రమేరును ఇత్తడి పళ్లెంలో వుంచి, భాద్రపద బహుళ పంచమి రోజున పూజ ప్రారంభిస్తారు.

యువతులంతా శ్రీ చక్రానికి చుట్టూ కూర్చుని దీపాలు వెలిగించి, తొమ్మిది రోజుల పాటు రకరకాల పూలతోను ... పసుపు కుంకుమలతోను పూజిస్తారు. ఈ ఆరాధన మంత్ర పూర్వకంగా కాకుండా ఆటపాటల రూపంలో కొనసాగుతూ వుంటుంది. ఈ పద్ధతి 'బొడ్డెమ్మ ఆట' పేరుతో ప్రచారంలో వుంది.

యువతులంతా కలిసి అమ్మవారికి రోజుకో నైవేద్యాన్ని సమర్పించి, చివరి రోజున పంక్తి భోజనాలు చేస్తారు. ఆ తరువాత ఉద్యాపన చెప్పుకుని, ఆ శ్రీ చక్రాన్ని దగ్గరలోని జలాశయంలో నిమజ్జనం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన వివాహ సంబంధమైన దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని భావిస్తుంటారు.


More Bhakti News