అశ్వంపై వచ్చి వెలసిన వేంకటేశ్వరస్వామి

వేంకటేశ్వరస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాలలో 'బండపాలెం' ఒకటి. సూర్యాపేట జిల్లా పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఈ గ్రామంలో బల్లపరుపుగా బండ పరుచుకుని ఉండటం వలన, ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. బల్లపరుపుగా ఇక్కడ పరచుకున్న ఈ బండపైనే వేంకటేశ్వరస్వామి వెలిశాడు. చాలా కాలం క్రితం ఇక్కడి పరిసరాల్లో గల పొలాల్లో రైతులు పనిచేస్తూ ఉండగా, తెల్లని అశ్వంపై దివ్యమైన తేజస్సు కలిగిన ఒక రూపం చాలా వేగంగా ఈ బండపైకి వచ్చిందట.

యువరాజు వేషధారణలో వున్న ఆయన ఎవరై ఉంటారా అని అంతా ఆలోచిస్తూ ఉండగానే, అశ్వంతో పాటు ఆ రూపం అదృశ్యమైందట. ఆశ్చర్యపోయిన రైతులు ఆ రూపం అదృశ్యమైన ప్రదేశానికి పరిగెత్తి చూడగా, అక్కడ వేంకటేశ్వరస్వామి శిలా రూపం కనిపించిందట. అలా వెలసిన స్వామివారికి ఆ తరువాత కాలంలో ఆలయాన్ని నిర్మించారు. నిజం నవాబుకి స్వప్నంలో స్వామివారు కనిపించి చెప్పడం వలన, నిత్య ధూపదీపాలకి అవసరమయ్యే మొత్తం ఇప్పటికీ ఆయన వంశీకుల నుంచే వస్తుందట. ఇంతలా బండ పరుచుకున్నప్పటికీ, ఇక్కడ నీళ్లు పడటం స్వామివారి మహిమేనని భక్తులు విశ్వసిస్తుంటారు.           


More Bhakti News