పురాణ కాలంనాటి గుత్తికొండ బిలం

గుత్తికొండ క్షేత్రం యుగయుగాలనాటి పౌరాణిక గాధతో ముడిపడి వుంది. ఇక్కడ ఈ క్షేత్రం వెలవడానికి కారణమైన కథ, ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. ఇక్కడి బిలం 'ముచికుంద మహర్షి'కి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, శ్రీ కృష్ణుడంతటివాడిని రప్పించుకుంది ... కాలయవనుడు అనే రాక్షసుడి సంహారానికి కారణమైంది.ఇంతటి ఘనతకు నిలయమైన గుత్తికొండ,గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో వుంది.

కృతయుగంలో దేవదానవులకు భయంకరమైన పోరు జరుగుతోంది. ఆ సమయంలో దేవతలు మహర్షుల సహాయ సహకారాలను కూడా తీసుకున్నారు. అలా వాళ్లు 'ముచికుంద మహర్షి' సాయాన్ని అర్ధించారు. దేవతల తరఫున దానవులను ఎదుర్కున్న ముచికుందుడు, దేవతలు విజయం సాధించడంలో ప్రధానపాత్రను పోషించాడు. అలసిపోయిన కారణంగా తనకి దీర్ఘ నిద్ర ప్రసాదించమని కోరాడు. తన నిద్రకి భంగం కలిగించిన వారిపై తన దృష్టి పడగానే వాళ్లు భస్మమై పోవాలంటూ వరాన్ని పొందాడు. భూలోకంలో దేవతలు చూపించిన ఓ కొండగుహలో ఆయన నిద్రకి ఉపక్రమించాడు ... అదే నేటి గుత్తికొండ బిలం.

కాలప్రవాహంలో త్రేతాయుగం ... ద్వాపర యుగంలో మూడు పాదాలు గడిచిపోయాయి. అప్పుడు శ్రీ కృష్ణుడి అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు, కాలయవనుడితో యుద్ధానికి తలపడుతున్నాడు. ఆ రాక్షసుడి బారినుంచి తప్పించుకున్నట్టుగా నటిస్తూ, శ్రీ కృష్ణుడు గుత్తికొండ బిలంలో జొరబడ్డాడు. ముచికుందుడి వరం గురించి తెలియని కాలయవనుడు కూడా ఆ బిలంలోకి వచ్చాడు. లోపల కృష్ణుడు కనిపించక పోవడంతో, ఆయన జాడ తెలుసుకోవడం కోసం ముచికుందుడిని బలవంతంగా నిద్రలేపాడు. అంతే ముచికుందుడి దృష్టి పడగానే కాలయవనుడు కాలి బూడిదై పోయాడు. అప్పుడు చాటు నుంచి బయటికి వచ్చిన శ్రీ కృష్ణుడు, ముచికుందుడికి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు.

లోక కల్యాణం కోసం జరిగిన మహత్కార్యానికి సాక్షీభూతంగా ఈ కొండగుహ దర్శనమిస్తుంది. సహజమైన ఈ గుహ నిర్మాణం ఇప్పటికి కూడా ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇక్కడ వెలసిన 'మల్లికార్జున స్వామి'కి భక్తులు విశేషమైన రీతిలో పూజలు చేస్తుంటారు.


More Bhakti News