బుద్ధావతారం

దశావతారాలలో బుద్ధావతారానికి ఎంతో విశిష్టత వుంది. రాక్షస జాతిలోని హింసా ప్రవృత్తిని నిర్మూలించి ... అది వారి బలహీనతగా మారిన సమయంలో పరమాత్ముడు వారిని సంహరించాడు. తారకాసురుడు కుమారులైన విద్యున్మాలి ... తారకాక్షుడు ... కమలాక్షుడు వరబల గర్వంతో అటు దేవతలను ఇటు సాధుజనులను నానాకష్టాలు పెట్టసాగారు.
దాంతో బ్రహ్మదేవుడు ... శ్రీ మహా విష్ణువు ఆవు - దూడగా రాక్షస రాజ్యంలోకి అడుగుపెట్టారు. అక్కడి తటాకంలోకి దిగి అవి దాహం తీర్చుకుంటుండగా తారకాసురుడి కుమారులు చూశారు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆవుదూడలను బంధించడానికి ఆ తటాకంలోకి దిగారు. దాంతో ఒక్కసారిగా ఆ తటాకంలోని నీరంతా తాగేసి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. దూడగా వున్న విష్ణువు బుద్ధుడిగా వారి ఎదుట ప్రత్యక్ష్య మయ్యాడు.
జరిగిన మాయ గురించి వాళ్లు ప్రశ్నించగా అందుకు సమాధానం చెబుతూనే, అహింసా మార్గంలోని గొప్పదనాన్ని గురించి వారికి ఉపదేశించాడు. బుద్ధుని బోధనలు ఆకట్టుకోవడంతో వారు తమ దూకుడును తగ్గించుకున్నారు. అదే అదనుగా భావించిన శ్రీ మహా విష్ణువు తనని ఆయుధంగా చేసుకుని వారిని సంహరించవలసిందిగా పరమశివుడితో చెప్పాడు. అలా ముక్కంటి చేతిలో అస్త్రమై లోక కల్యానార్థం శ్రీ మహా విష్ణువు ఆ రాక్షస వీరులను సంహరించాడు.