శనిదోష ప్రభావం తగ్గడానికి ఇదో మార్గం !

ఎంతటి వాళ్లైనా శని ప్రభావానికి తలవంచవలసిందే. ఆయన ఆదేశం మేరకు కష్టనష్టాలను అనుభవిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించవలసిందే. శని ప్రభావానికిలోనైన వాళ్లు మరొకరిని ఆశ్రయించడం వల్లనో ... సాయాన్ని పొందడం వల్లనో బయటపడలేరు. శనిదేవుడి మనసు గెలుచుకుని ఆయనని శాంతింపజేయడం మినహా మరోమార్గం లేదు.

ఇందుకోసం చాలామంది హోమాలు ... జపాలు చేయిస్తుంటారు. శనిదేవుడు కొలువైన క్షేత్రాలకు వెళ్లి ఆయనకి అభిషేకాలు జరుపుతుంటారు. శనిదోషం నుంచి బయటపడటానికిగాను అందుకు సంబంధించిన దానాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే. అయితే శని దోషంతో బాధపడుతోన్నవాళ్లు తమ ప్రవర్తనను మార్చుకోవడం వలన కూడా ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్పబడుతోంది.

శని ప్రభావం నుంచి బయటపడాలనుకునే వాళ్లు ముందుగా దురాలవాట్లకు దూరంగా వుండాలి. ఏ విషయానికి సంబంధించైనా అబద్ధాలు చెప్పకూడదు ... అన్యాయాలకి పాల్పడకూడదు. తామంత గొప్పవాళ్లు లేరనే అహంభావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇతరులకి సాయపడటమే జీవితానికి అర్థమనీ, భగవంతుడి సేవలో తరించడమే పరమార్థమని గ్రహించాలి.

ఇలా దురలవాట్లకు దూరంగా, ధర్మకార్యాలకు ... దైవకార్యాలకు దగ్గరగా వుండటమనేది శనిదేవుడుకి ప్రీతిని కలిగిస్తుంది. ఫలితంగా ఆయన నుంచి ప్రతికూల ప్రభావం తగ్గుతూపోతుంది. అందువలన నియమబద్ధమైన ... ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ వుండటం వలన శనిప్రభావం నుంచి ఉపశమనాన్ని పొందవచ్చనే విషయాన్ని మరచిపోకూడదు.


More Bhakti News