కోరినవరాలను అందించే కొండంత దేవుడు

శ్రీకృష్ణుడికి వేణువు అంటే ప్రాణం ... ఆయన వేణుగానమంటే గోపాలకులకు ... గోపికలకు ప్రాణం. మనోహరమైన రూపంతో ... మధురమైన వేణుగానంతో ఆయన అందరి హృదయాలను దోచుకునేవాడు. అలాగే తన భక్తులకు ఎదురయ్యే కష్టాలను కూడా తొలగించేవాడు.

అడుగడుగునా అసురసంహారం చేస్తూ ... ధర్మసంస్థాపన చేస్తూ వచ్చిన ఆయనని చాలా ప్రాంతాలలోని భక్తులు తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు. ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాలలో ఒకటి 'బాబుసాయిపేట' లో వెలుగొందుతోంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పరిధిలో గల ఈ క్షేత్రంలో 'వేణుగోపాలస్వామి' కొలువై దర్శనమిస్తుంటాడు.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి మంటపంలో కూర్చుంటే కృష్ణుడి వేణుగానం లీలగా వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తి సౌందర్యం చూడటానికి రెండుకళ్ళూ చాలవనిపిస్తుంది. సాక్షాత్తు గోపాలుడు ఎదురుగా వచ్చి నుంచున్న అనుభూతి కలుగుతుంది. 'కృష్ణాష్టమి' తో పాటు ఇతర పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి.

కృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేవి భజనలు ... కోలాటాలు కనుక అవి ఇక్కడి ఉత్సవాల్లో భాగంగా కనిపిస్తూ వుంటాయి ... అలరిస్తూ వుంటాయి. కృష్ణా అనే నామాన్ని స్మరించినంత మాత్రాన్నే కష్టాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడి కృష్ణుడు కనిపిస్తుంటాడు.

కష్టాలు సతమతం చేస్తున్నప్పుడు ఈ స్వామికి చెప్పుకుంటే చాలు, ఆయన అనుగ్రహంతో అవి తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక్కడి స్వామిని విశ్వసించినవాళ్లు కష్టాల్లో పడినప్పుడు ఆ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకున్న సందర్భాలు వున్నాయని చెబుతుంటారు. అందువలన ఇక్కడ కన్నయ్య ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భావిస్తుంటారు. తమకి కొండంత అండగా ఆ స్వామిని ఉన్నాడని చెబుతూ, ప్రేమానురాగాలతో కూడిన భక్తి శ్రద్ధలతో ఆయనని సేవించుకుని తరిస్తుంటారు.


More Bhakti News