అదే ఇక్కడి వినాయకుడి విశేషం !

తమిళనాడు ప్రాంతంలోని ప్రాచీన క్షేత్రాల్లో 'తిరుచిరాపల్లి' ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడి కొండపై వినాయకుడి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఎత్తయిన కొండ పైభాగంలో కనిపించే ఈ ఆలయం 'ఉచ్చిపిళ్ళైయార్ కోయిల్'గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వినాయకుడి నుదుటిపై ఒక మచ్చ కనిపిస్తూ ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం కనిపిస్తుది.

వినాయకుడి నుదుటిపై గల మచ్చకీ ... శ్రీరంగనాథస్వామికి సంబంధం ఉందని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. విభీషణుడిపై గల అభిమానంతో శ్రీరాముడు ... రంగనాథస్వామి విగ్రహాన్ని ఇచ్చి పూజించుకోమని చెబుతాడు. ఆ విగ్రహాన్ని ముందుగా ఎక్కడ పెడితే అక్కడే ప్రతిష్ఠితమవుతుందని అంటాడు. శివుడి ఆత్మలింగాన్ని రావణుడు తీసుకువెళుతూ ఉండగా గోపాలకుడి వేషంలో వినాయకుడు ఏంచేశాడో ... విభీషణుడి విషయంలోనూ అలాగే చేస్తాడు.

ఫలితంగా రంగనాథస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠితమైపోతుంది. ఆగ్రహావేశాలకిలోనైన విభీషణుడికి దొరక్కకుండా వినాయకుడు సమీపంలోని కొండపైకి పరిగెత్తుకు వెళ్లినా ఆయన బారి నుంచి తప్పించుకోలేకపోతాడు. ఆ సందర్భంలో అయిన గాయమే వినాయకుడి నుదుటిపై మచ్చలా కనిపిస్తుందని అంటారు. ఆ తరువాత ఆ బాలుడు వినాయకుడని తెలుసుకున్న విభీషణుడు అదే ప్రదేశంలో ఆయనకి ఆలయాన్ని నిర్మిస్తాడు.

నుదుటిమీద గాయంతో వినాయకుడు వెలిస్తే ... మూలవిరాట్టుకి ఆ మచ్చ అలా ఉండిపోవడం విశేషం. ఆనాటి సంఘటనకు నిదర్శనంగా నిలిచిన వినాయకుడి ఆలయం అక్కడికి దగ్గరలో రంగనాథస్వామి ఆలయం చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే అదృష్టమని అనిపిస్తుంది.


More Bhakti News