గురుపౌర్ణమి రోజున దేనిని దానంగా ఇవ్వాలి ?

గురువు ... అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తాడు. జ్ఞానమే మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్దుతుంది ... ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది. తమని తాము మహోన్నతంగా మలచుకోవడానికి జ్ఞానానికి మించిన సాధనం లేదు. ఆ సాధన గురువు అనుగ్రహంతోనే ఫలిస్తుంది ... ఆయన చూపిన మార్గమే ఆశించిన గమ్యానికి చేరుస్తుంది. జీవితానికి ఒక అర్థాన్ని ... పరమార్థాన్ని ప్రసాదిస్తుంది.
అలాంటి గురువులకే గురువుగా ... జగద్గురువుగా వ్యాస భగవానుడు ప్రసిద్ధి చెందాడు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమిని 'వ్యాసపౌర్ణమి' అంటారు ... వ్యాసుడు జన్మించింది ఈ రోజునే. లోకానికి వేదాలను ... అష్టాదశ పురాణాలను ... మహాభారతాన్ని అందించిన జగద్గురువుగా ఆయన కీర్తించబడుతున్నాడు. ఆయనని పూజించడం వలన 'బ్రహ్మత్వం' సిద్ధించబడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ కారణంగానే ఆయన జన్మదినమైన ఈ రోజున, విద్య నేర్పినటువంటి గురువులను ... మంత్రోపదేశం చేసిన గురువులను పూజిస్తూ వుండటం ఒక సంప్రదాయంగా వస్తోంది. లోకంలో శాంతిస్థాపన చేయడం కోసం ... ధర్మ మార్గాన్ని ఉద్ధరించడం కోసం ఎంతోమంది గురువులు ఎంతో కృషి చేశారు. వాళ్లందరినీ ఈ రోజున స్మరించుకోవలసిన అవసరం వుంది. అలాంటి గురువులకు సంబంధించిన ఆలయాలను ... మందిరాలను దర్శించుకోవాలి.
ఇక ఇంతటి విశిష్టమైన రోజున ఏది దానంగా ఇస్తే విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయోననే సందేహం సహజంగానే చాలామందికి కలుగుతుంటుంది. అందుకు సమాధానంగా ... 'విష్ణు పురాణం' దానంగా ఇవ్వాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. విష్ణుపురాణం దానంగా ఇవ్వడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని స్పష్టం చేస్తున్నాయి.