అదే గురువాయురప్ప మహిమ !

ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతోన్న అత్యంత విశిష్టమైన క్షేత్రాల్లో 'గురువాయూర్' ఒకటిగా చెప్పబడుతోంది. కేరళ - త్రిసూర్ జిల్లా పరిధిలో వెలుగొందుతోన్న ఈ క్షేత్ర మహాత్మ్యం గురించీ ... ఇక్కడి బాలకృష్ణుడి లీలా విశేషాలను గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. మహిమాన్వితమైన అలాంటి సంఘటనల గురించి వింటూ వుంటే, 'నారాయణ భట్టాతిరి' పేరు కూడా వినిపిస్తుంది.

అనేక శాస్త్రాలలో ప్రావిణ్యాన్ని సంపాదించిన ఆయన, యవ్వనంలో ఉండగానే తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు. ఎంతమంది వైద్యులను మార్చినా ... ఎన్ని రకాల మందులు వాడినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం ఆ కుటుంబ సభ్యులను ఎంతగానో బాధిస్తుంది. తన పనులు తాను చేసుకోవడానికి కూడా శరీరం సహకరించకపోవడంతో ఆయన మానసికంగా కుంగిపోతాడు.

అలాంటి పరిస్థితుల్లో ఆయన మనసు 'గురువాయురప్పన్' మీదకి మళ్లుతుంది. ఎన్నో మహిమలు చూపిన స్వామికి తన ఆరోగ్యం కుదుటపడేలా చేయడం పెద్ద విషయం కాదని అనుకుంటాడు. ఆయన తప్ప ఇక తనని ఎవరూ రక్షించలేరంటూ, అపారమైన విశ్వాసంతో స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు.

రోజులు గడుస్తున్నాకొద్దీ ఆయన ఆరోగ్యం కుదుట పడసాగింది. తన ఆవేదనని స్వామి ఆలకించాడనీ ... అనుగ్రహించాడని ఆయనకి అర్థమైపోతుంది. అంతే ఆ ఆనందంలో ఆయన స్వామిని స్తుతిస్తూ 'నారాయణీయం' రచించాడట. ఇక్కడి బాలకృష్ణుడిని కీర్తిస్తూ చేసిన రచనల్లో 'నారాయణీయం' ప్రత్యేకమైన స్థానాన్ని అలంకరించి కనిపిస్తుంది. స్వామి మహిమకు నిలువెత్తు నిదర్శనమై పలకరిస్తుంది.


More Bhakti News