అంతా తెలుసనుకుంటే అమాయకత్వమే

జీవితమంటేనే కొత్త విషయాలు తెలుసుకుంటూ ... కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడం. ఈ నేపథ్యంలో కొంతమంది తమకి ఏదైనా విషయం తెలియదని చెప్పుకోవడానికి నామోషీ పడుతుంటారు. ఇంకొంత మంది తమకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఈ రెండు పద్ధతులు కూడా కొత్త విషయాలు తెలుసుకోకుండా అడ్డుపడేవే. నామోషీ అనుకునే వాళ్లు ఏ విషయాన్ని తెలుసుకోలేరు. అలాగే తమకి అంతా తెలుసని అనుకునే వాళ్లు అక్కడే ఆగిపోతారు.

తమకి తెలియని విషయాలను అంగీకరిస్తూ అడిగి తెలుకునే వాళ్లు ఉత్తములుగా చెప్పబడుతున్నారు. నిజానికి తెలుసుకోవడమనే ఆసక్తికి ఒక ముగింపు అనేది వుండదు. అనంతమైన విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ వెళుతూ వుంటే, అందుకు ఒక జీవితకాలం సరిపోదనే విషయం అర్థమవుతుంది. అప్పటి వరకూ తాము తెలుసుకున్నది ఎంత తక్కువనేది స్పష్టమవుతుంది.

ఇలాంటి అనుభవం సాక్షాత్తు 'భరద్వాజ మహర్షి' కి ఎదురైంది. వేదాలను పూర్తిగా అధ్యయనం చేయడం కోసం భరద్వాజ మహర్షి అహర్నిశలు కృషిచేశాడు. అయినా తెలుసుకోవలసింది చాలా మిగిలిపోయిందనే ఉద్దేశంతో, కొన్ని వందల సంవత్సరాల పాటు జీవించే వరాన్ని బ్రహ్మదేవుడు నుంచి పొందుతాడు. ఆ సమయం పూర్తయినా వేదాలను అధ్యయనం చేయడం పూర్తికాకపోవడంతో ఆయన ఆలోచనలో పడతాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయనకి వేదరాశిని చూపిస్తాడు. మహాపర్వతంలా వున్న ఆ వేదరాశిని చూసి భరద్వాజుడు ఆశ్చర్యపోతాడు. పర్వతం వంటి ఆ వేదరాశిలో అప్పటి వరకూ తాను తెలుసుకున్న వేదం పిడికెడు కూడా లేదనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. అలా విజ్ఞానమనేది అనంతమైనది ... తెలుసుకుంటూ వెళుతున్నా కొద్దీ తెలుసుకోవలసింది ఎంతో మిగిలే వుంటుంది. ఉత్తములు ఈ విషయాన్ని గ్రహించి కొత్త విషయాలు తెలుసుకుంటూ ... నేర్చుకుంటూ ముందుకు సాగుతుంటారు.


More Bhakti News