శాపాలను తొలగించే దివ్యక్షేత్రం

అనేక పుణ్యక్షేత్రాలను తనలో దాచుకుని భక్తిభావ పరిమళాలను వెదజల్లుతోన్న ఆధ్యాత్మిక అమృత కలశం భారతదేశం. ఇది వేదభూమి ... దేవతలు నడయాడిన పుణ్యభూమి. శివకేశవులు ... శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఇచ్ఛాపూర్వకంగా అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా 'తిరుక్కురుగూర్' కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించాడు.

108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో స్వామివారు 'ఆదినాథ పెరుమాళ్' పేరుతోను ... అమ్మవారు 'ఆదినాథవల్లి' పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. అటు పురాణపరమైన నేపథ్యాన్ని ... ఇటు చారిత్రకపరమైన వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం, దర్శనమాత్రం చేతనే ధన్యులను చేస్తుంది. ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహారాజులు ఈ క్షేత్ర దర్శనం చేసుకుని శాపవిమోచనం పొందినట్టుగా ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.

పితృదేవతలను పూజించని కారణంగా దేవేంద్రుడు శాపగ్రస్తుడు అవుతాడు. ఆ శాపం నుంచి విముక్తి పొందడం కోసం అనేక క్షేత్రాలను దర్శిస్తూ ఆయన ఈ దివ్యక్షేత్రనికి చేరుకుంటాడు. ఇక్కడి 'తామ్రపర్ణి' నదిలో స్నానం చేసి, ఆదినాథ పెరుమాళ్ ను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఆ స్వామి అనుగ్రహంతో ఆయన ఆ శాపం నుంచి విమోచన పొందాడు. జీవితంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు, ఆర్ధికపరమైన ... ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమైపోతున్నప్పుడు పాపమో .. శాపమో అందుకు కారణమని భావించడం జరుగుతూ ఉంటుంది.

అలాంటి వాళ్లు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆయన దర్శనం చేసుకుంటారు. విశేషమైన రోజుల్లో ఆయన ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ ఉంటారు. భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఆయనకి కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తుంటారు.


More Bhakti News