పాము పుట్టలో నుంచి ఓంకారం !

భారతదేశంలో నాగుపాములను దేవతలుగా ఆరాధించే సంప్రదాయం అనాది కాలం నుంచి వస్తోంది. నాగుపాములను దేవతలుగా ... వాటి నివాస స్థలమైన పుట్టలను నాగదేవతల ఆలయంగా భావించి పూజిస్తూ వుంటారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చినప్పుడు, పుట్టలోనే తలదాచుకున్నాడు.

ఇక స్వయంభువు మూర్తులు తమకి తాముగా ప్రకటనమయ్యేవరకూ, తరతరాలపాటు పుట్టలోనే ఉండిపోవడం విశేషం. ఈ విధంగా భగవంతుడినీ, ఆయన విగ్రహ రూపాలని తనలో భద్రపరచుకోవడంలో పాముపుట్టలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వచ్చాయి. అలాంటి ఒక పుట్ట నేపథ్యంలో వెలసిన క్షేత్రంగా మనకి 'రంగనాయకుల గుట్ట' కనిపిస్తుంది. ఇది రంగారెడ్డి జిల్లా 'గండి చెరువు' సమీపంలో కనిపిస్తుంది.

పూర్వం ఈ గుట్టపై నుంచి అదే పనిగా గాలివాటుగా 'ఓంకారం' వినిపిస్తూ ఉండేదట. ఈ ధ్వని తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడం కోసం, కొంతమంది గ్రామస్తులు గుట్టపైకి చేరుకున్నారు. ఒక పెద్ద పాము పుట్టలో నుంచి ఓంకారం వస్తున్నట్టుగా నిర్ధారణ చేసుకున్నారు. ఆ పుట్టలో నుంచే సుగంధ పరిమళాలు వెదజల్లబడుతూ ఉండటంతో, లోపల ఏవుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పుట్టను కూలదోయకుండా పాలధారలతో కరిగించారు. ఫలితంగా పది అడుగుల రంగనాయక స్వామివారి మూర్తి బయటపడింది. దాంతో ఇక్కడే స్వామివారిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. ఇంత పెద్ద విగ్రహం పుట్టలో పదిలపరచబడి వుండటం, నిత్యం ఓంకారాన్ని ధ్వనింపజేస్తూ .. సుగంధ పరిమళాలు వెదజల్లుతూ స్వామి తన జాడను తెలుపుతూ వెలుగుచూడటం మహిమాన్వితమైన సంఘటనగా భక్తులు భావిస్తుంటారు.


More Bhakti News