బ్రహ్మోత్సవాల వలన కలిగే ఫలితం ఏమిటి ?

బ్రహ్మోత్సవాలు అనగానే తిరుమలలో జరిగే శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు, తిరుపతిలో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. వివిధ వాహనాలపై వైభవంగా ఊరేగే స్వామివారిని దర్శిస్తూ ధన్యులవుతుంటారు.

సాధారణంగా ఇంట్లో అనునిత్యం జరుపుకునే పూజ ప్రధాన ఉద్దేశం, తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండమని కోరుకోవడమే అవుతుంది. ఇక గ్రామానికి సంబంధించిన ఆలయంలో నిత్యపూజలు నిర్వహించడం వెనుక ప్రధానమైన ఉద్దేశం, తమ ఊరు పాడిపంటలతో కళకళలాడుతూ ఉండాలని ఆశించడమే అవుతుంది. బ్రహ్మోత్సవాల విషయానికి వచ్చేసరికి, దేశం సుభీక్షంగా ఉండటం కోసం వీటిని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది.

దేశం అతివృష్టి ... అనావృష్టి బారిన పడకుండా కాపాడమని ఆ దైవాన్ని కోరుతూ బ్రహ్మోత్సవాలని నిర్వహిచడం జరుగుతోంది. ఇక ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వైఖానస ఆగమం ప్రకారం 'ప్రత్యూష పూజ' .. 'ప్రభాత పూజ' .. 'మధ్యాహ్న పూజ' .. 'అపరాహ్నపూజ' .. 'సాయంకాల పూజ' .. 'రాత్రి పూజ' అనే ఆరు విధాలైన పూజలను జరుపుతుంటారు. ఇలా ఒక్కో సమయంలో జరిపే ఒక్కో పూజ వలన ఒక్కో ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ పూజల వలన దేశం పై శత్రువుల దాడి జరగకుండా, దేశంలో కరవుకాటకాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రజలు మంచి మార్గంలో నడచుకుంటూ, దేశాభివృద్ధిలో ప్రధానమైన పాత్రను పోషిస్తారు. ఆచారవ్యవహారాలకి రక్షణ కల్పించే ఆధ్యాత్మిక భావాలు అందరిలోనూ వికసిస్తుంటాయి. ఇలా దేశ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ... ఆయా క్షేత్రాల్లో అనుకోకుండా జరిగే దోషాలను నివారిస్తూ బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతుంటాయి ... అందరి ఆనందం కోసమే ఆ భగవంతుడికి నిత్య నీరాజనాలు సమర్పించబడుతుంటాయి.


More Bhakti News