దేవతలు తిరుగాడే మానససరోవరం

పరమశివుడి నిజ నివాసంగా చెప్పుకునే కైలాసగిరి సమీపంలో మానససరోవరం ... రాక్షస తాల్ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ రెండు సరోవరాలు కూడా పక్కపక్కనే రెండు కళ్లుగా కనిపిస్తుంటాయి. రెండువందల చదరపుమైళ్ల విస్తీర్ణం కలిగిన మానససరోవరాన్ని చూడాలనీ, ఆ పవిత్ర జలాల్లో స్నానమాచారించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందు కోసం భక్తులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మానససరోవర యాత్రను కొనసాగిస్తుంటారు.

బ్రహ్మదేవుడు ఇక్కడ వలయాకారంలోగల పర్వతాలను సౌందర్యాన్ని చూసి మురిసిపోయాడట. ఈ పర్వతాల మధ్యనగల విశాలమైన ప్రదేశంలో సరోవరం వుంటే ఎంత బాగుంటుందోనని అనుకున్నాడట. అంతే ఆయన మనసు నుంచి ఇక్కడి సరోవరం ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడి మనసు నుంచి ఉద్భవించినది కనుక ఇది మానససరోవరంగా పిలవబడుతోంది. ఇందులో స్నానమాచరించడం వలన మోక్షం లభిస్తుందని చెప్పబడుతోంది.

ఇక్కడికి రాత్రి సమయాల్లో దేవతలు వస్తారనీ, ఈ సరస్సులో స్నానమాచరించి కైలాస నాథుడిని అర్చిస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ ప్రదేశానికి చేరుకున్న భక్తులు చీకటిపడేలోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం దేవతల రాకను చూడాలనే ఆసక్తితో అక్కడే మకాం వేస్తుంటారు. అలా వేచి ఉన్నవారిలో కొందరికి చిత్రమైన అనుభవాలు ఎదురైనా సందర్భాలు ఉన్నాయి.

అప్పటి వరకూ నిర్మలంగా ఉన్న సరస్సులో అలల అలజడి కలగడం ... స్నానమాచరిస్తోన్న ధ్వనులు కావడం ... నడుస్తున్నట్టుగా గజ్జెల శబ్దాలు వినిపించడం ... బృందంగా వచ్చినట్టుగా నవ్వులు వినిపించడం వంటివి జరిగాయట. దాంతో దేవతలు ఈ సరస్సులో స్నానమాచారిస్తారంటూ ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్పినవి అక్షరసత్యాలని యాత్రికులు అభిప్రాయపడుతుంటారు. ఇప్పటికీ దేవతలు ఇక్కడ తిరుగాడుతూ ఉన్నారనడంలో ఎలాంటి సందేహంలేదనీ, తమకి స్వయంగా ఆ అనుభూతి కలిగిందని చెబుతుంటారు.


More Bhakti News