చూపులేకున్నా దైవదర్శనం సాధ్యమేనా ?

దేవుడు సర్వాంతర్యామి ... ఆయన లేని ప్రదేశమంటూ ఏదీలేదని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ రూపాన్ని సంతరించుకున్నా అనంతుడిగా చెప్పబడుతోన్న ఆయనని చూడటానికి ఈ చర్మ చక్షువులు చాలవని పెద్దలు చెబుతుంటారు. చూపున్న వారే దైవాన్ని చూడలేనప్పుడు, ఇక చూపులేని వారి పరిస్థితి ఏంటి ? అని చాలామంది అనుకుంటూ ఉంటారు. గుడిలోని దేవుడి విగ్రహాలను చూసే భాగ్యమైనా కలిగినందుకు సంతోషపడిపోతూ సంతృప్తి చెందుతుంటారు.

అయితే భగవంతుడిని చూడవలసినది కళ్లతో కాదు ... మనసుతో అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మనసు అనే మనో నేత్రంతోనే ఆయనని దర్శించాలని స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని 'ప్రియతమ్ దాస్' అనే భక్తుడు నిరూపించాడు. 17 శతాబ్దం తొలినాళ్లలో అహ్మదాబాద్ సమీపంలో గల ఓ గ్రామంలో ప్రియతమ్ దాస్ జన్మించాడు. పుట్టుకతోనే అంధుడైన ఆయన, బాల్యంలోనే కన్నవాళ్ల ప్రేమానురాగాలకు దూరమవుతాడు.

తనని ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రియతమ్ దాస్ భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకుంటాడు. వయసుతోపాటే ఆ బంధాన్ని పెంచుకుంటూ వస్తాడు. ఆశువుగా దైవాన్ని కీర్తిస్తూ ఆ తన్మయత్వంలో తేలిపోతుండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి అయన ఆలయానికి వెళతాడు. కంటి చూపులేకున్నా ఆత్రుతగా గర్భాలయం దగ్గరికి వస్తున్న ఆయనని అక్కడి అర్చకుడు అడ్డుకుంటాడు. దైవదర్శనానికి ఆయన అంతలా ఆరాటపడుతుండటం గురించి ఎద్దేవాచేస్తూ మాట్లాడతాడు.

దాంతో ప్రియతమ్ దాస్ గర్భాలయం వైపు చూస్తూ స్వామివారిని ఆశువుగా కీర్తిస్తాడు. స్వామివారు ధరించిన వస్త్రాలను ... ఆభరణాలను ... ఆయనని అలంకరించిన పూలరకాలను తన కీర్తనలతో వర్ణిస్తాడు. ఆ దృశ్యం చూసిన అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోతారు. నిజమైన భక్తులు భగవంతుడిని మనసుతో దర్శిస్తారని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ప్రియతమ్ దాస్ ను దైవాంశ సంభూతుడిగా భావించి, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకి నమస్కరిస్తారు.


More Bhakti News