ఆలయానికి దారిచూపిన నాగుపాము

మాణిక్య ప్రభువుల వారు అడుగుపెట్టిన ప్రదేశం సిరిసంపదలతో తులతూగుతుందనీ ... అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని అందరూ విశ్వసించసాగారు. ఈ కారణంగా ఎంతోమంది భక్తులు తమ ప్రాంతానికి రావలసిందిగా ఆయనని ఆహ్వానించే వారు. భక్తుల అభ్యర్థనను మన్నిస్తూ ఆయన వివిధ ప్రాంతాలను దర్శిస్తూ ఉండేవాడు. అలా ఆయన ఒకసారి తన శిష్య బృందం వెంటరాగా పల్లకీలో బయలుదేరతాడు.

కొంత దూరం వెళ్లాక ఒకచోట దారికి అడ్డుగా పెద్ద నాగుపాము వస్తుంది. దానిని చూడగానే పల్లకిని మోసే బోయలు హడలిపోతారు. ఆ నాగుపాము ప్రభువుల వారి వైపు సూటిగా చూసి, పడగను దించి ఓ పక్కకి వెళుతుంది. ఆ నాగుపాము తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందనీ ... దానిని అనుసరించమని ప్రభువుల వారు బోయలతో చెబుతాడు. ప్రభువుల వారు వున్నారనే ధైర్యంతో వాళ్లు ఆ పాముని అనుసరిస్తారు.

అలా కొంతదూరం వెళ్లిన పాము ... ఓ పురాతనమైన ఆలయానికి సమీపంలో అదృశ్యమైపోతుంది. అది 'ఝరణి నరసింహస్వామి' ఆలయం. అక్కడి గుహలో గల ఉగ్రనరసింహస్వామిని ప్రభువులు దర్శించి పూజించారు. పామును అనుసరిస్తూ ప్రభువుల వారు రావడం ... అక్కడి నరసింహస్వామి గుహలోకి వెళ్లడం బోయలకి విచిత్రంగా అనిపించసాగింది.

అంతలో గుహలో నుంచి బయటికి వచ్చిన ప్రభువులు, అక్కడి నరసింహస్వామి తన పూర్వీకులచే పూజలు అందుకున్నట్టుగా చెబుతాడు. ఆ స్వామి దర్శనభాగ్యం కల్పించడం కోసమే ఆ నాగుపాము తనని అక్కడికి తీసుకువచ్చిందని అంటాడు. ఆ మాటలు విన్న బోయలు మరింత ఆశ్చర్యపోతారు. తనని అక్కడికి రప్పించడం నరసింహస్వామి ఆదేశంగా ప్రభువుల వారు భావిస్తాడు.

స్వామివారి సన్నిధిలో కొంతకాలం వుండాలని నిర్ణయించుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాడు. అనునిత్యం నరసింహస్వామిని దర్శిస్తూ ... సేవిస్తూ ఉండేవాడు. ప్రభువులవారు ఈ క్షేత్రంలో వున్నట్టు తెలుసుకున్న భక్తులు అక్కడికే వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్లేవారు. అలా చాలాకాలం తరువాత ఆ క్షేత్రంలో భక్తుల సందడి మొదలవుతుంది.


More Bhakti News