కుజదోషాన్ని నివారించే క్షేత్రం

అందమైన జీవితాన్ని ఊహించుకుంటోన్నవారు, తమకి 'కుజదోషం' వుందని తెలియగానే అల్లకల్లోలానికి లోనవుతుంటారు. కుజ దోషానికి పరిహారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, అందులో భాగంగా అనేక క్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. అలా కుజ దోషం గల వారిని ఆ దోషం నుంచి బయటపడేసే సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం మనకి నెల్లూరు జిల్లా 'మల్లాం' లో కనిపిస్తుంది.

ఈ క్షేత్రాన్ని దర్శించిన ఎంతోమంది కుజదోష ప్రభావం నుంచి బయట పడినట్టుగా చెబుతుంటారు. అయితే ఇదంతా ప్రచారం కోసం చేస్తోన్న ఆర్భాటం అనుకుంటే పొరపాటే. ప్రచారమే అవసరం లేని స్వయంభువు స్వామివారు ఇక్కడ కొలువై కనిపిస్తుంటాడు. శ్రీవల్లీ - దేవసేన సమేతంగా ఇక్కడ స్వామి ఆవిర్భవించిన కథనం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. పూర్వం మల్లాసురుడిని ఈ ప్రదేశంలో సంహరించిన సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.

క్రీ.శ.6 వ శతాబ్దం తొలినాళ్లలో యుద్ధానికి వెళ్లి తిరిగి వస్తూ ఇక్కడ బసచేసిన పాండ్య రాజుకి, స్వామి దర్శనమిచ్చి స్వయంభువుగా మారిపోయాడు. సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆ రాజు అలాగే వుంచి వల్లీ - దేవసేనల ప్రతిమలను తయారుచేయించాడు. ఆ తరువాత ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ఆనాటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి తన మహిమలను అనేక విధాలుగా చూపుతూనే వున్నాడు.

ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. రథాన్ని పోలివుండే ఇక్కడి వంద స్తంభాల మంటపాన్ని చూసి తీరవలసిందే. ఆలయమంతా కూడా అద్భుతమైన ఆనాటి శిల్పకళా విశేషాలను ఆవిష్కరిస్తూ వుంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామికి ... అమ్మవార్లకి ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. నయనానంద భరితంగా జరిగే ఈ వేడుకల్లో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News