త్రిలింగేశ్వర క్షేత్రం

కాకతీయ ప్రభువులు అనునిత్యం శివుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్లు. శివుడికి పూజాభిషేకాలు నిర్వహించిన తరువాతనే వాళ్లు తమ దైనందిన కార్యక్రమాలు ఆరంభించే వాళ్లు. తమ పరిపాలనా కాలంలో అనేక ప్రాంతాల్లో శివాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాచీన శివాలయాల పునరుద్ధరణకు తమ వంతు కృషి చేశారు. ఈ కారణంగానే నేడు ఎన్నో శివాలయాలు భక్తులు దర్శించుకోవడానికి తగిన సౌకర్యాలతో అలరారుతున్నాయి.

కాకతీయులు నిర్మించిన ప్రతి శివాలయానికి ఏదో ఒక ప్రత్యేకత వుంటూనే వుంటుంది. అలాంటి విశేషాన్ని కలిగివున్న విశిష్ట క్షేత్రం మనకి నల్గొండ జిల్లా 'పొనుగోడు'లో దర్శనమిస్తుంది. సాధారణంగా శివాలయాల్లో ప్రధాన శివలింగం గర్భాలయంలో కొలువై వుండగా, ప్రాంగణంలో ఒకటి రెండు శివలింగాలు కనిపిస్తుంటాయి. ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించబడిన మూడు శివలింగాలు కూడా ఒక్కొక్కటి ఒక్కో గర్భాలయాన్ని కలిగివుండటం విశేషం.

ఈ మూడు ఆలయాలు ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నందున ఇక్కడి శివయ్యని 'త్రిలింగేశ్వరుడు' గా పిలుస్తుంటారు. ఈ మూడు ఆలయాల మధ్యలో మంటపం దర్శనమిస్తుంది. స్వామివారికి సంబంధించిన వేడుకలు ఈ మంటపంలోనే ఘనంగా జరుగుతూ వుంటాయి. పరమేశ్వరుడి త్రిశూలం ... ఆయన ధరించే విభూతి రేఖలు ... ఆయన నేత్రాలు 3 సంఖ్యను సూచిస్తుంటాయి. ఆ సంఖ్యకు గల విశిష్టతను సంతరించుకుని ఈ మూడు శివలింగాలు నిత్యపూజలు అందుకుంటూ వుంటాయి.

ఇక్కడి శివయ్యను దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. కార్తీక మాసంలోను ... శివరాత్రి పర్వదినం సందర్భంగాను భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఇక కాకతీయులు శివలింగాలని ప్రతిష్ఠించిన చాలా చోట్ల వేంకటేశ్వరస్వామిని గానీ, వేణుగోపాలస్వామిని గాని ప్రతిష్ఠిస్తూ వచ్చారు. అలాగే ఈ ప్రాంగణంలో వాళ్లు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలుడిని ప్రతిష్ఠించారు. అందువలన ఇది హరిహర క్షేత్రమై అలరారుతోంది ... భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతోంది.


More Bhakti News