శివాజీకి అమ్మవారి దర్శనం

నిజాయితీకి ... నిర్భయానికి ... సాహసానికి ... త్యాగానికి మారుపేరు శివాజీ మహారాజు. ఆయనని తలచుకోవడానికి శత్రువులు భయపడేవారు ... ప్రజలు సంతోషపడేవారు. శివాజీ కేవలం విజయాలు ... సంపదలపైనే దృష్టి పెట్టలేదు. సాహిత్యం ... కళలు ... ఆధ్యాత్మికతపై కూడా ఆయన శ్రద్ధ పెట్టాడు.
తన హయాంలో మహారాష్ట్రకి చెందిన కవులను ... గాయకులను ... మహాభక్తులను ఆయన చేరదీశాడు. వారి ఆదరణకి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నో క్షేత్రాలను పునరుద్ధరించాడు ... గోపురాలు ... మంటపాలు కట్టించాడు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు మనకి ఇప్పటికి కూడా కనిపిస్తుంటాయి. ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోన్న శ్రీశైలం ఉత్తర గోపురాన్ని శివాజీనే నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.
శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన ఆయన అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయ్యాడట. కొంతకాలం పాటు పరిపాలనా బాధ్యతలను ముఖ్యులకు అప్పగించి అక్కడే ధ్యానం చేసుకోసాగాడు. రోజులు గడుస్తున్నా పరిపాలనా సంబంధమైన పనులను గురించి ఆయన పట్టించుకోకపోవడం మంత్రులకు ఆందోళన కలిగించింది. ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించగా, భ్రమరాంబికా దేవి అనుమతి లభిస్తే తాను అక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడట.
అయితే ఆ రోజే అమ్మవారు శివాజీకి దర్శనమిచ్చి, రాజుగా ప్రజారంజకమైన పరిపాలనను అందించడమే ఆయన చేయవలసిన పని అనీ, చివరిదశలో మోక్షం లభిస్తుందంటూ అనుగ్రహించిందని అంటారు. ఈ సంఘటనకు గుర్తుగానే అప్పట్లో ఆయన ధ్యానం చేసుకున్న ప్రదేశంలో ఇప్పుడు 'శివాజీ స్ఫూర్తి కేంద్రం' దర్శనమిస్తూ వుంటుంది. శ్రీశైలం వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తి కేంద్రాన్ని చూడవలసిన అవసరం ఎంతైనా వుంది.