కార్తీక బహుళ చవితి తరువాత?

కార్తీక బహుళ చవితి రోజున 'కరక చతుర్థి వ్రతం' చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. ఇక సంతానం లేనివారికి 'కార్తీక బహుళ అష్టమి' ఒక వరంలాంటిదని చెప్పొచ్చు. ఈ రోజున దంపతులు శివపార్వతులను వివిధరకాల పూలతో పూజిస్తూ, 'దాంపత్యాష్టమి వ్రతం' ఆచరించడం వలన తప్పక ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇక కార్తీక బహుళ ఏకాదశిని 'ఉత్పత్తి ఏకాదశి' అనీ ... 'రమా ఏకాదశి' అని అంటూ వుంటారు. ఈ రోజున 'కామధేను వ్రతం' చేయడం వలన ... పెసరపిండితో తయారుచేసిన లడ్లను దానం చేయడం వలన అనేక దోషాలు తొలగిపోయి, సుఖసంతోషాలు కలుగుతాయని చెబుతారు. 'కార్తీక బహుళ ద్వాదశి' రోజున దూడతో కూడిన ఆవును పూజించడం వలన, విశేషమైన ఫలితాలను పొందవచ్చని చెప్పబడుతోంది.

'కార్తీక బహుళ త్రయోదశి' రోజున యమునా నదిలో స్నానం చేసి యముడికి తర్పణం వదలాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు చేసే యమదీప దానాల వలన అపమృత్యు భయం లేకుండా పోతుందని అంటారు. 'మాసశివరాత్రి' రోజున శివుడికి పూజాభిషేకాలు నిర్వహించడం వలన అనంతమైన పుణ్యఫలాలు అవలీలగా లభిస్తాయని చెబుతారు.

ఇక కార్తీక బహుళ అమావాస్యను 'గీతాజయంతి'గా పేర్కొంటారు. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడుకి శ్రీకృష్ణుడు ఈ రోజునే గీతోపదేశం చేశాడని చెబుతారు. ఈ రోజున చేసే లక్ష్మీపూజ వలన సకల సంపదలు కలుగుతాయని అంటారు.


More Bhakti News