శ్రీ దాసాంజనేయస్వామి క్షేత్రం

హనుమంతుడు ఆవిర్భవించిన క్షేత్రాలు ఆరోగ్యాన్నిచ్చే క్షేత్రాలుగా ... ఐశ్వర్యాన్నిచ్చే క్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. ఈ కారణంగానే హనుమంతుడు కొలువైన ఆలయాలు నిత్యం రద్దీగా కనిపిస్తూ వుంటాయి. అలా అశేష భక్త జనకోటిచే నిత్యపూజలు అందుకుంటోన్న క్షేత్రంగా కృష్ణా జిల్లా 'మాచవరం' దర్శనమిస్తుంది.
ఇక్కడి ఆలయం వెనుక వందల సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంది. హనుమంతుడు ఇష్టపూర్తిగా ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు తెలుస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల ఆధ్యాత్మిక గురువుగా వున్న వ్యాసతీర్థుల వారు, అనేక ప్రదేశాలలో హనుమ ప్రతిమలను ప్రతిష్ఠిస్తూ విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు.
ఈ సమయంలోనే హనుమంతుడు అక్కడికి వచ్చి, ఆయనను వెంట తీసుకుని వెళ్లి ప్రస్తుతం ఆలయం నిర్మించబడి వున్న ఈ ప్రదేశాన్ని చూపించాడు. ఆయన ఆదేశం మేరకే వ్యాసరాయల వారు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠింపజేశాడు. నాటి నుంచి ఇక్కడి స్వామిని భక్తులు ఇలవేల్పుగా భావించి పూజిస్తున్నారు. తమ కుటుంబానికి సంబంధించి వివాహాది శుభకార్యాలను స్వామివారికి తెలియజేసిన తరువాతనే జరుపుతుంటారు.
స్వామివారి చుట్టూ 9వారాలపాటు ప్రదక్షిణలు చేస్తే, కోరిన కోరికలు నెరవేరతాయని చెబుతారు. గ్రహ సంబంధమైన పీడలు ... అనారోగ్యాలు తొలగిపోతాయని అంటారు. భక్తులపాలిట కల్పతరువైన ఇక్కడి స్వామికి 'హనుమజ్జయంతి' ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. గ్రామస్తులంతా కూడా ఈ ఉత్సవాన్ని ఓ పండుగలా జరుపుతుంటారు ... స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు.