సింగరకొండ

సింగరకొండ
కొండపై వెలసిన 'లక్ష్మీ నృసింహస్వామి'కి దేవాలయం నిర్మిస్తుండగానే, కొండ దిగువున ప్రసన్నాంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ జరిగిపోయింది. ఈ ప్రతిష్ఠ గురించి ముందుగా తెలియని గ్రామస్తులు అప్పుడు ఆశ్చర్యపోయారు ... ఆ తరువాత అది దైవలీల అని గుర్తించారు. చిత్రమైన ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని 'సింగరకొండ'లో చోటు చేసుకుంది. క్రీ.శ.14 వ శతాబ్దంలో ఈ దేవాలయాలు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది.

పూర్వం ఈ ప్రాంతంలో 'సింగన్న'అనే నృసింహస్వామి భక్తుడు ఉండేవాడట. అతని కూతురు 'నరసమ్మ' పశువులను మేపడానికి ఈ కొండపైకి వచ్చేది. ఆ పశువుల్లో ఒక ఆవు కొంత కాలంగా పాలు ఇవ్వకపోవడం గమనించిన సింగన్న, రహస్యంగా దానిని అనుసరించాడు. కొండపైనున్న ఒక బండ రాయిలో నుంచి ఒక బాలుడు వచ్చి, ఆవు పాలు తాగి వెళ్లడం చూసిన సింగన్న ఆశ్చర్యపోయాడు. ఆ బాలుడు సాక్షాత్తు నృసింహస్వామిగా అనిపించడంతో, ఆ రాతికి దేవాలయం నిర్మించాడు.

కొండపై ఆలయ నిర్మాణం జరుగుతూ వుండగా, అదే సమయంలో ఎవరో ఒక సాధువు కొండ దిగువలో చెరువు ఒడ్డున హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మొదలు పెట్టాడు. అప్పటికప్పుడు జరిగిపోతున్న ఆ ప్రతిష్ఠను కొండపై నుంచి చూసిన గ్రామస్తులు, ఆశ్చర్యంతో కిందకి దిగి వచ్చేలోగా ఆ సాధువు కనిపించలేదు. ఆయన ప్రతిష్ఠించిన ఆంజనేయస్వామి విగ్రహం మాత్రం జీవకళ ఉట్టిపడుతూ అద్భుతంగా అక్కడ నిలిచి వుంది.

దాంతో గ్రామస్తులంతా కలిసి అది దైవలీలగా భావించారు. లక్ష్మీ నృసింహస్వామి వారితో పాటు ప్రసన్నాంజనేయస్వామికి కూడా ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి లక్ష్మీ నృసింహస్వామి కోరిన కోరికలు తీర్చే కొండంత దైవంగా వెలుగొందుతుండగా, దుష్ట గ్రహ పీడల నుంచి రక్షించే దైవంగా ప్రసన్నాంజనేయ స్వామి ప్రసిద్ధి చెందాడు. విశేష పర్వదినాల్లో భక్తులు ఇక్కడికి అశేష సంఖ్యలో విచ్చేసి తమ మొక్కుబళ్లు చెల్లిస్తుంటారు.

More Bhakti Articles