బీచుపల్లి హనుమంతుడు

బీచుపల్లి హనుమంతుడు
ఎవరైనా సరే ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయా దేవతలను గురించి తెలుసుకుని వారిని ఆరాధించడం ... పూజించడం చేస్తుంటారు. అయితే పసితనంలోనే అందరి అక్కున చేరే దైవంగా హనుమంతుడు కనిపిస్తుంటాడు. పసిపిల్లలు దుష్టగ్రహాల బారినపడకుండా చూడటం కోసం వారి మెడలో ఆంజనేయస్వామి 'రూపు' కడుతూ వుంటారు. ఇక ఆ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నట్టయితే ఆ పిల్లలను దగ్గర పడుకోబెట్టుకుని ఆంజనేయస్వామి దండకం చదువుతూ వుంటారు.

ఇలా పసి వయసు నుంచే హనుమంతుడి రక్ష అందరికీ లభిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలోనే స్వామి ఆలయాలు అనేక ప్రాంతాల్లో కొలువై ... కొంగుబంగారమై అలరారుతున్నాయి. అలా స్వయంభువుగా స్వామి ఆవిర్భవించిన క్షేత్రం మనకి మహబూబ్ నగర్ జిల్లా 'బీచుపల్లి' లో దర్శనమిస్తుంది. ఇక్కడి కృష్ణా నదీ తీరంలో వెలసిన హనుమంతుడు కొన్ని వందల సంవత్సరాల చరిత్రను కలిగివున్నట్టుగా చరిత్ర చెబుతోంది.

ఈ స్వయంభువు స్వామిని 16 వ శతాబ్దంలో వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రాచీనకాలానికి చెందిన ఇక్కడి హనుమంతుడు తొలిపూజను బోయల నుంచి స్వీకరిస్తాడు. ఆ తరువాత పూజాభిషేకాలు అర్చకులు నిర్వహిస్తూ వుండటం ఆనవాయతీగా వస్తోంది. ఇక్కడి హనుమంతుడిని దర్శించడం వలన సమస్త దోషాలు నశించి సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

వైశాఖ మాసంలో అయిదు రోజులపాటు స్వామికి ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇదే ప్రాంగణంలో సీతారాములు ... శివ పార్వతులు ప్రత్యేక మందిరాలలో కొలువై పూజలు అందుకుంటూ వుంటారు. హరిహరులతో విలసిల్లుతోన్న ఈ క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించ వలసిన క్షేత్రమని చెప్పక తప్పదు.

More Bhakti Articles