పాదరస శివలింగం

పాదరస శివలింగం

పాదరస శివలింగం
ఏయే శివలింగాలను పూజించడం వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయనేది పురాణాల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సాధారణంగా రాయితో మలచబడిన శివలింగమే ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుందని చెబుతుంటారు. అలాంటిది ఆ శివలింగం ... పటిక బెల్లంతోను ... స్పటికతోను ... పాదరసంతోను చేయబడినదైతే, అది అనంత పుణ్య ఫలాలను అందిస్తుందని తెలుస్తోంది. అలాంటి పుణ్య ఫలాన్ని అందుకోవడం కోసం విఠల్ గౌడ్ మహారాజ్ చేసిన ప్రయత్నానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది 511 కిలోల 'పాదరస'శివలింగం. ఈ ఘనతను సొంతం చేసుకున్న ఈ క్షేత్రం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం ... అంక్సాపూర్ లో దర్శనమిస్తుంది.

మహారాష్ట్ర - పర్బనిలో ప్రతిష్ఠించబడిన 51 కిలోల పాదరస శివలింగం ... హరిద్వార్ లో కొలువైన 101 కిలోల పాదరస శివలింగం ఇప్పటి వరకూ పెద్దవిగా చెప్పబడ్డాయి. పాదరస శివలింగం ప్రతిష్ఠించడం వలన ... పూజించడం వలన సకల సంపదలు ... ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణాలు ప్రస్తావించిన కారణంగా విఠల్ గౌడ్ మహారాజ్ అందుకు పూనుకున్నాడు.

కాశీలో కొంతకాలం పాటు తపస్సు చేసిన ఆయన, పాదరస శివలింగ విశిష్టతను గురించి అక్కడి మహనీయుల ద్వారా తెలుసుకున్నాడు. అక్కడి నుంచి తన ఊరు చేరుకొని 511 కిలోల పాదరస శివలింగాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించాడు. దాని ఎదురుగా ఒక్కొక్కటీ కిలో బరువుగల 108 పాదరస శివలింగాలను తయారు చేయించి పుష్పగిరి శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపజేశాడు. దాంతో ఇప్పుడు ఇదే దేశంలోని అతిపెద్ద పాదరస శివలింగంగా భావించవచ్చని అంటున్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ... నవరాత్రులు ... దత్త జయంతి ... గురు పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలను నిర్వహిస్తుంటారు. ఈ వైభవాన్ని కనులారా తిలకించేందుకుగాను విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.

More Bhakti Articles