పచ్ మఢి

పచ్ మఢి
చుట్టూ కొండలు ... అక్కడి నుంచి దూకే జలపాతాలకు ఆహ్వానం పలుకుతూ కనిపించే లోయలు. పవిత్రంగా కనిపించే ఆ ప్రకృతి ఒడిలోనే పరమశివుడు కొలువుదీరి కనిపిస్తాడు. అందంగా ... ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రాంతం పేరే 'పచ్ మఢి'. ఇది మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వత శ్రేణులపై శివ నివాసంగా అలరారుతోంది. ఇక్కడ స్వామివారిని 'జటా శంకర్'అని పిలుస్తూ వుంటారు.

సతీ వియోగం కలగగానే ఆమె దేహాన్ని తన భుజంపై వేసుకుని ఆవేదనతో శివుడు ఇక్కడే నాట్యం చేశాడని అంటారు. అందుకు గుర్తుగా శివుడి వెంట్రుకలు తగలడం వలన అక్కడి గుహ గోడలపై ఏర్పడిన చారలు కూడా కనిపిస్తాయి. ఇక ఇక్కడికి దగ్గరిలోనే కనిపించే జలపాతం మనసుకి కావలసిన ఉత్సాహాన్ని అందిస్తుంది. పూర్వం ఈ జలపాతం కింద అప్సరసలు స్నానం చేశారట. ఈ కారణంగానే ఈ జలపాతానికి 'అప్సర విహారం'అనే పేరు వచ్చింది.

ఇక శివుడు తనకి ఇచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి భస్మాసురుడు ప్రయత్నించిన ప్రదేశం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. భస్మాసురుడి బారి నుంచి శివుడు తప్పించుకుని దాక్కున్న ఇరుకైన గుహ మార్గం ... ఈ లోగా విష్ణువు వచ్చి మోహిని వేషంలో భస్మాసురుడిని తెలివిగా అంతం చేసిన ప్రదేశం ఇక్కడ కనిపిస్తాయి. ఈ సంఘటనలు ఇక్కడే జరిగాయనడానికి గుర్తుగా శివలింగం ... పెద్దమొత్తంలో నాటబడిన త్రిశూలాలు దర్శనమిస్తాయి. ఇక ఈ విషయంలో స్థానిక కథనాల సంగతి ఎలా ఉన్నా, ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోవాలనుకునే వారు ... ఆధ్యాత్మిక చింతనలో ఆసాంతం తరించాలనుకునేవారు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తీరాలి.

More Bhakti Articles