వీరన్న క్షేత్రం

వీరన్న క్షేత్రం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోగల 'ఉరుకుంద'గ్రామంలో వెలసిన నారసింహుడు, ప్రాచీన కాలానికి చెందినవాడుగా కనిపిస్తాడు. ఇక్కడ స్వామివారు ఆవిర్భవించిన తీరుకూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.'హిరణ్య'అనే పేరుగల ఒక యోగి పశువులు మేపడం కోసం ఉరుకుంద గ్రామానికి వచ్చేవాడట. పశువులు మేస్తూ వుండగా ఆయన ఒక రావిచెట్టు కింద ధ్యానం చేస్తూ కూర్చునే వాడు.

ఆయన సాధారణ వ్యక్తి కాదని గ్రామస్తులు గ్రహించి, వ్యాధిగ్రస్తులైన వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చేవారు. వారి నమ్మకానికి తగినట్టుగానే త్వరలోనే వ్యాధిగ్రస్తులు కోలుకునేవారు. దాంతో ఆయనను దర్శించుకునే వారిసంఖ్య రోజురోజుకు పెరగసాగింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ రోజున ఆయన హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దాంతో ఆ గ్రామస్తులు ఆయనని వీరభద్రస్వామిగా భావించి, అక్కడ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

ఆ ప్రయత్నాల్లో తవ్వకాలు జరుపుతూ వుండగా ప్రాచీనకాలంనాటి నృసింహస్వామి విగ్రహం లభించింది. ఇక ఇటు వీరభద్ర స్వామికి ... అటు నృసింహస్వామికి ఒకేచోట ఆలయాలు నిర్మించారు. ఇక వీరభద్ర స్వామిని జానపదులు వీరన్నగా పిలుచుకుంటారు కనుక, ఈ ఆలయం 'వీరన్న క్షేత్రం'గా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి రాఘవేంద్రస్వామికి కూడా ప్రత్యక్ష అనుభవం కలగడంతో, ఆయన ఇక్కడి నృసింహస్వామి వారిని దర్శించుకు వెళ్లారని స్థల పురాణం చెబుతోంది.

ఇక్కడి స్వామివారు అనారోగ్యాల బారినుంచి ... ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ... అడిగినంతటనే ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు.

More Bhakti Articles