సర్వం శివమయం

సర్వం శివమయం
పాండురంగస్వామి మహాభక్తుడు నామదేవుడు. అయితే ఆయనలో ఇంకా అజ్ఞానం ... అహంకారం ఉన్నాయనీ, గురుసేవతో వాటిని తొలగించుకోమని సాక్షాత్తు ఆ పాండురంగడే స్వయంగా చెబుతాడు. దాంతో గురువును వెతుక్కుంటూ వివిధ క్షేత్రాలను దర్శిస్తూ వుంటాడు నామదేవుడు.

ఈ నేపథ్యంలో ఆయన ఓ మఠానికి చేరుకుంటాడు. అక్కడ ఓ సాధువు ఒక శివలింగంపై తల ... మరో శివలింగంపై కాళ్లు పెట్టుకుని హాయిగా నిద్రపోతుంటాడు. అది చూసిన నామదేవుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు.శివలింగం పై కాళ్లు పెట్టడం మహాపాపమంటూ ఆ సాధువు ధోరణి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆయన అజ్ఞానాన్ని పటాపంచలు చేయాలని ఆ సాధువు నిర్ణయించుకుంటాడు.

వయసైపోయిన కారణంగా అది శివలింగమనే ధ్యాసలేకుండా పోయిందని నామదేవుడితో ఆ సాధువు చెబుతాడు. తన శరీరం సహకరించడంలేదనీ, అందువలన తన కాళ్లను శివలింగం పై నుంచి తీసి శివలింగం లేని చోట పెట్టమని కోరతాడు. ఆ మాటలకి శాంతించిన నామదేవుడు, ఆ సాధువు కాళ్లను శివలింగం పై నుంచి తప్పించి కింద పెట్టబోయాడు. ఆయన కాళ్లను ఎక్కడ వుంచబోతే అక్కడ శివలింగాలు ఆవిర్భవిస్తూ వుంటాయి.

దాంతో ఆ సాధువు సామాన్యుడు కాడనే విషయాన్ని నామదేవుడు గ్రహిస్తాడు. సర్వం శివమయమనే విషయాన్ని మరచి అజ్ఞానంతో ... అహంకారంతో ప్రవర్తించినందుకు తనని మన్నించమని ఆ సాధువును కోరతాడు. శివుడులేని ప్రదేశం తన శిరస్సేనంటూ ఆయన కాళ్లను తన శిరస్సుపై పెట్టుకుంటాడు. పాండురంగస్వామి దయవలన తనకి గురువు లభించాడంటూ ఆ సాధువు పాదాలకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు.

More Bhakti Articles