ధన త్రయోదశి విశిష్టత

ధన త్రయోదశి విశిష్టత
ప్రతి ఒక్కరి జీవితంలోను ఆర్ధికపరమైన వ్యవహారాలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. ఆర్ధికపరమైన భద్రతే ఆనందాన్ని ... ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంటుంది. ప్రాచీనకాలంలో సంపద అనేది బంగారం రూపంలోనే వుండేది. బంగారాన్ని అంతా లక్ష్మీస్వరూపంగా భావిస్తూ వుండేవాళ్లు. బంగారాన్ని కొనుగోలు చేయడమంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావడమేనని విశ్వసిస్తుండేవాళ్లు. ఇదే నమ్మకం నేటికీ కొనసాగుతోంది. ఈ కారణంగానే 'ధనత్రయోదశి' రోజున బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటూ వుంటాయి.

'ఆశ్వయుజ బహుళ త్రయోదశి'ని ధన త్రయోదశి అని అంటారు. ఈ రోజుతోనే 'దీపావళి' పండుగ సందడి మొదలవుతుంది. ఉత్తరాది వారి ఆచారంగా కనిపించే 'ధన్ తే రాస్' ... ధన త్రయోదశిగా నేడు భారతీయులందరినీ ప్రభావితం చేస్తోంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఏడాది పొడవునా బంగారం కొంటూనే వుంటామనే బలమైన విశ్వాసం అందరిలోనూ కనిపిస్తూ వుంటుంది. ఈ రోజున ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని భావిస్తుంటారు.

ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ... విష్ణుమూర్తిని ... కుబేరుడిని ... యమధర్మరాజుని ... ధన్వంతరిని పూజిస్తుంటారు. ఈ ఆచారం వెనుక పురాణ సంబంధమైన కథ లేకపోలేదు. నరకాసురుడి ధనాగారంలో బందీగా వున్న అమ్మవారిని శ్రీ మహావిష్ణువు విడిపించి, లక్ష్మీదేవిగా అమ్మవారిని పట్టాభిషిక్తురాలిని చేసింది ఈ రోజే. సమస్త లోకాల సంపదలకు కారకురాలైన లక్ష్మీదేవినీ, ఆ తల్లి అనుగ్రహాన్ని అందుబాటులోకి తెచ్చిన కారణంగా శ్రీ మహావిష్ణువును కూడా పూజిస్తుంటారు.

సంపదలకు కుబేరుడు అధిపతి కనుక ఈ రోజున ఆయనను ఆరాధిస్తూ వుంటారు. ఈ రోజున బంగారం రూపంలో లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావడం వలన మృత్యుభయం తొలగిపోతుందని అంటారు. బంగారుకాంతులు ... దీపాల వెలుగులు కలిసి యమధర్మరాజు దృష్టిని మళ్లించి ఆయన మనసును మార్చేస్తాయట. దాంతో ఉత్తచేతులతో వెనుదిరిగిన ఆయనకి అంతా కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు. యమధర్మరాజుని శాంతింపజేసే రోజు కనుక దీనిని 'యమత్రయోదశి' అని కూడా పిలుస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపదలు ... యముడి దయవలన ఆయుష్షు పొందిన వాళ్లు, ఆరోగ్యం కోసం ధన్వంతరిని ఆరాధిస్తారు.

ఇక సంపదలు ... ఆయుష్షు ... ఆరోగ్యం గురించి దేవతలను ఆరాధించిన వారు, అవి స్థిరంగా ఉండేలా పితృదేవతల ఆశీస్సులను కోరుకుంటారు. అందువల్లనే ఈ రోజు సాయంత్రం ప్రధాన ద్వారం చెంత అన్నాన్ని రాశిగా పోసి దానిపై దీపపు ప్రమిదను ఉంచుతారు. ఆ వెలుగు పితృదేవతలకు దారి చూపుతుందనీ, వాళ్లు వచ్చి ఆశీర్వదించి వెళతారని విశ్వసిస్తూ వుంటారు. అలా ధన త్రయోదశి ... పెద్దల ఆశీస్సులతో పాటు, ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ తన విశిష్టతను చాటుకుంటోంది.

More Bhakti Articles