ఘన నారసింహ క్షేత్రం

ఘన నారసింహ క్షేత్రం
హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామిని ప్రహ్లాదుడు అనేక విధాలుగా శాంతింపజేశాడు. లక్ష్మీదేవి కూడా అనేక ఉపచారాలు చేస్తూ ఆయనను శాంతపరిచింది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవితో సహా నరసింహస్వామి అనేక క్షేత్రాల్లో ఆవిర్భవించాడు. అలాంటి పుణ్యక్షేత్రాలలో 'ఘనపురం' ఒకటిగా అలరారుతోంది.

మెదక్ జిల్లా సిద్ధిపేటకు సమీపంలో గల ఈ క్షేత్రం పురాతనమైనదే కాదు, అంతకు మించిన మహిమాన్వితమైనది. ఇక్కడి నరసింహస్వామిని స్వయంభువుగా చెబుతారు. 17 వ శతాబ్దం ప్రారంభంలో ఓ రైతు తన పొలంలో బావిని తవ్విస్తుండగా లక్ష్మీ నరసింహస్వామి ఆళ్వారులతో సహా బయటపడ్డాడు. అయిదు అడుగుల పైన గల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చూపరులను సమ్మోహితులను చేస్తుంది.

ఇంతటి మనోహరమైన విగ్రహం మరెక్కడా లేదని చెబుతుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయనీ, కోరిన వరాలు దక్కుతాయని అంటారు. విశేషమైన పుణ్య తిథుల్లో స్వామివారిని అశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఇక ప్రతియేటా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను చూసి తీరవలసిందే.

ఈ సందర్భంగా వివిధ వాహనాలపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ వుంటాడు. స్వామివారి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు ఆయన అనుగ్రహం కారణంగా తమకి జరిగిన మేలుకి కృతజ్ఞతలు తెలుపుతూ కానుకలు - మొక్కుబడులు చెల్లిస్తుంటారు.

More Bhakti Articles