బాల గణపతి క్షేత్రం

బాల గణపతి క్షేత్రం
ప్రాచీనకాలం నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా వినాయకుడిని ఆరాధిస్తూ వస్తున్నట్టుగా ఆధారాలు వున్నాయి. అనేక క్షేత్రాల్లో వివిధ నామాలతో వినాయకుడు విలసిల్లుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వినాయకుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు విశిష్టమైనవిగా ప్రసిద్ధి చెందుతున్నాయి. పాండిచ్చేరిలోని 'యానాం' సిద్ధి గణపతి క్షేత్రం ఈ కోవలోనిదే.

పచ్చని ప్రకృతి ఒడిలో గోదావరి నదీ తీరంలో అలరారుతోన్న వినాయకుడిని భక్తులు 'పిళ్లై యార్' అని పిలుస్తుంటారు. తనని అడ్డుకున్న వినాయకుడి తల ఖండించిన శివుడు, ఆ వెంటనే ఆయనకి ఏనుగు తలని అతికించాడు. దాంతో వినాయకుడిని గుర్తించలేకపోయిన పార్వతీదేవి, శివుడితో '' ఈ పిల్లవాడు ఎవరు ?'' అని అడిగిందట. ఈ కారణంగానే తమిళులు స్వామిని ఈ పేరుతో పిలుస్తూ వుంటారు. దాంతో దీనిని బాలగణపతి క్షేత్రంగా కూడా భావిస్తుంటారు.

చాలాకాలం క్రిందట ఒక తమిళ సాధువు ఈ ప్రదేశంలో బసచేశాడట. ఆ సమయంలోనే ఆయన అక్కడ గల ఒక పుట్టలో గణపతి ప్రతిమ వుండటం గమనించి, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించాడు. స్వామికి 'పిళ్లై యార్' అని నామకరణ చేసి పూజలు ప్రారంభించాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్య పూజాభిషేకాలు జరుగుతూ వస్తున్నాయి.

గర్భాలయంలో స్వామి విగ్రహం తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. ప్రతి బుధవారం ఇక్కడ స్వామివారికి పంచామృతాభిషేకాలు జరుపుతుంటారు. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి స్వామిని పూజించడం వలన అనారోగ్యాలు ... ఆపదలు తొలగి శుభాలు కలుగుతాయని స్థానికులు చెబుతుంటారు.

More Bhakti Articles